రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు
యాచారం: నగర ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా డిసెంబర్‌నాటికి మూడోదశ కృష్ణా జలాలను తరలించడానికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై జరుగుతున్న మూడో దశ కృష్ణాజలాల తరలింపు పనులను పరిశీలించారు.
మార్గమధ్యలో గునుగల్ గ్రామంలో ఉన్న రిజర్వాయర్‌ను సందర్శించారు. ఇక్కడ నిర్మిస్తున్న 99 ఎంఎల్ నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లను పరిశీలించారు. నీటి సామర్థ్యం, ఎప్పటిలోగా పూర్తవుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గునుగల్‌లో నిర్మించిన రిజర్వాయర్లు, మూడో దశ రిజర్వాయర్ల పనులు తదితర విషయాలను హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఎండీ జగదీశ్వర్ మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనుల్లో వేగవంతం కోసమే అధికారుల బృందంతో కలిసి హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా కోదండపూర్ వరకు జరుగుతున్న పైపులైన్, రిజర్వాయర్ల పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. నీటి పన్ను చెల్లించే విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకరావాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. పన్నులు చెల్లిస్తే నీటి ఇబ్బంది ఉండదన్నారు. పన్నుల వసూలు విషయంలో సీఎం కేసీఆర్ సైతం కఠినంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.
‘పట్నం’ ప్రజలకు సరిపడా..
మూడోదశ కృష్ణా జలాల్లో ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలకు సరిపడా తాగునీరు అందించే విధంగా అధికారులను ఆదేశించనున్నట్లు మంత్రి తెలిపారు. కరువు ప్రాంతమైన పట్నంకు సరిపడా కృష్ణాజలాలు సరఫరా చేయాలని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, గునుగల్ సర్పంచ్ అచ్చెన మల్లికార్జున్ తదితరులు మంత్రికి విన్నవించారు.
దీనికి స్పందించిన మంత్రి నివేదిక తెప్పించుకొని సీఎం ఆదేశాల మేరకు ఈ ప్రాంతానికి తాగునీరు అందించేలా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు సత్యానారాయణ, కొండారెడ్డి, విజయకుమార్, దశరథ్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రామకృష్ణ యాదవ్, నాయకులు శ్రీనివాస్, జగదీశ్వర్ యాదవ్, నారాయణరెడ్డి, యాదయ్య గౌడ్, లక్ష్మణ్, మధుసూదన్‌రెడ్డి, సంధాని, భాషా, భాస్కర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.