‘నిధులు పుష్కలంగా ఉన్నాయి. 2014 మార్చిలోపు నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి మూడో దశ కృష్ణా జలాలను మహానగరానికి తరలిస్తాం’. 2013 మార్చిలో సాహెబ్‌నగర్ వద్ద పనుల శంకుస్థాపనలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాట..
‘మూడో దశ కృష్ణాజలాల పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకముందే డిసెంబర్‌లోపే మహానగరానికి కృష్ణా జలాల్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యం’. గత నెల 20న గునుగల్ రిజర్వాయర్ సందర్శనలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు అన్న మాట.
‘కోదండపూర్ నుంచి మహానగరం వరకు అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న పనులు, రిజర్వాయర్లలో కూడా పనులు మిగిలున్నాయి. డిసెంబర్‌లోపు నగరానికి కృష్ణా జలాలను తరలించకున్నా.. వచ్చే ఏడాది మార్చిలోపు తప్పనిసరిగా నీటిని తరలిస్తాం’. పనుల పర్యవేక్షణ ఉన్నతాధికారి అంటున్న మాట. ఆ అధికారి అన్న మాటలను బట్టి చూస్తే మూడో దశ కృష్ణా జలాలు డిసెంబరులో మహానగరానికి చేరడం కష్టమేననిపిస్తోంది.
మూడో దశ కృష్ణా జలాలను గొట్టపు మార్గం ద్వారా మహానగరానికి అందించడానికి రూ. 1,670 కోట్ల అంచనా వ్యయంతో నగర సమీపంలోని సాహెబ్‌నగర్ వద్ద 2013 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర సమీపంలోని బీఎన్ రెడ్డి (సాహెబ్‌నగర్) నగర్ వరకు 115 కిలోమీటర్ల మేర గోతులు తీసి గొట్టపు మార్గంలో పైపులు బిగించి మహానగరానికి 5.5 టీఎంసీల కృష్ణా జలాలను అందించడమే మూడో దశ లక్ష్యం. రూ.1,670 కోట్లలో గొట్టపు మార్గం పనుల పూర్తికి రూ.943.44 కోట్లు, కోదండపూర్ వద్ద రూ.149 కోట్ల వ్యయంతో నిర్మించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిని శుద్ధి చేసే ప్లాంట్, రూ. 24 కోట్లతో నర్సర్లపల్లి, గోడుకొండ్ల, గునుగల్ కేంద్రాల వద్ద 99 ఎంఎల్ సామర్థ్యం కలిగిన నీటి జలాశయాలు, రూ.140 కోట్ల వ్యయంతో నీటి శుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ వ్యవస్థ కోసం అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
2013లో ప్రారంభించిన పనులు 2014 మార్చిలోపే పూర్తయి మూడో దశ 5.5 టీఎంసీల కృష్ణా జలాలు మహానగరానికి చేరాల్సి ఉంది. కానీ అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడం, ప్రభుత్వం నుంచి రూ.వందల కోట్ల నిధులు సకాలంలో అందకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. మంత్రి పద్మారావు అన్నట్లు గడువు ఇంకా 50 రోజులు ఉంది. ఇప్పటికైనా నిధులు తక్షణమే విడుదల చేస్తే పనులు చకచకా పూర్తి చేయడం సాధ్యమేనని వారు అంటున్నారు.
ప్రస్తుతం పనులు పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి లోపు కూడా పూర్తి స్థాయిలో మహానగరానికి మూడో దశ కృష్ణా జలాలు అందేలా కనిపించడం లేదు. ఇదే విషయమై మూడో దశ పనుల పర్యవేక్షణ చేసే ఓ ఉన్నతాధికారిని సంప్రదించగా డిసెంబర్‌లో పనులు పూర్తిచేసి కృష్ణాజలాలు నగరానికి అందించేలా చూస్తున్నాం. కానీ వచ్చే ఏడాది మార్చి లోపు మాత్రం కచ్చితంగా సరఫరా చేస్తామనే నమ్మకం తమకు ఉందన్నారు.
ఆశలన్నీ మూడో దశపైనే..
ఇబ్రహీంపట్నం డివిజన్ ప్రజలు మూడో దశ కృష్ణాజలాల సరఫరాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడంలేదు. భూగర్భ జలాల నీటి మట్టం 500 అడుగులకు పడిపోయింది. డివిజన్‌లోని ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, హయత్‌నగర్ మండలాల్లో చాలా గ్రామాల్లో ఇప్పటికే బోరుబావులు పూర్తిగా ఎండిపోయాయి. హయత్‌నగర్ మండలం మినహా మిగతా మూడు మండలాల్లోని 100కుపైగా గ్రామాల్లో ఫ్లోరైడ్ శాతం అత్యధికంగా ఉంది.
ఏడేళ్లుగా మూడు మండలాల్లోని 135 గ్రామాలకుపైగా కృష్ణాజలాలు సరఫరా చేస్తున్న ప్రత్యేక సంపులు, ట్యాంకులు లేకపోవడంతో ఫ్లోరైడ్ నీరే దిక్కవుతోంది. డివిజన్‌లో నిత్యం కోటీ 50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తే కొంతవరకైనా నీటి ఎద్దడి తప్పుతుంది. గునుగల్ రిజర్వాయర్ నుంచి డివిజన్‌లోని పలు మండలాలకు నిత్యం 60 నుంచి 70 లక్షల లీటర్ల నీటిని మాత్రమే మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు యాచారం, ఇబ్రహీంపట్నం, లోయపల్లి, కందుకూరులకు నాలుగు లైన్ల ద్వారా నాలుగు రోజులకోసారి కృష్ణాజలాలను సరఫరా చేస్తున్నారు.
మూడో దశ పనులు పూర్తయితేనే ఇబ్రహీంపట్నం ప్రజలకు సరిపడా కృష్ణాజలాలు సరఫరా చేస్తామని గత నెల గునుగల్‌కు వచ్చిన మంత్రి పద్మారావు, మెట్రో వాటర్‌వర్క్స్ అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజల్లో ఆశలు రేకెత్తాయి. కరువు పరిస్థితులతో ఇప్పటికే డివిజన్‌లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. మార్చిలోపు నీరు అందితేనే ప్రజల నీటి కష్టాలు తీరుతాయని డివిజన్ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ విజయలక్ష్మి పేర్కొన్నారు.
రిజర్వాయర్, గొట్టపు మార్గం పనుల్లో జాప్యం
Published Tue, Nov 18 2014 11:54 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement