యాచారం, న్యూస్‌లైన్: మూడో దశ కృష్ణా జలాల తరలింపు నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. మార్చి నెలాఖరు వరకు పూర్తికావాల్సిన పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. మార్చి నాటికి మూడో దశ పైపులైన్ ద్వారా నగరానికి, రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల ప్రజలకు మంచినీరు సరఫరా చేస్తామని పనుల ప్రారంభం రోజున సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వాగ్దానం నెరవేరేలా లేదు. ఈ ఏడాది జూన్‌లో కృష్ణా మూడో దశ పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1,670కోట్ల అంచనా వ్యయంతో నల్లగొండ జిల్లా కోదండపూర్ నుంచి నగర శివారులోని బీఎన్‌రెడ్డి(సాహెబ్)నగర్ వరకు 115 కిలో మీటర్ల వరకు పైపులైన్ ఏర్పాటుకు నిర్ణయించారు. మూడో దశలో నగరానికి 5.5 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉంది. సాహెబ్‌నగర్ వద్ద పనులకు సీఎం శంకుస్థాపన చేయగానే టెండర్లు పిలిచారు. మొత్తం రూ.943.44కోట్లతో 115కి.మీ మేర ఒక్కో సంస్థ 8కి.మీ చొప్పున పైపులు తయారుచేసి, గోతులుతీసి గొట్టపు మార్గాన్ని బిగించడానికి టెండర్లు దక్కించుకున్నాయి. టెండర్లు దక్కించుకున్న సంస్థలు పనుల్లో నిమగ్నమయ్యాయి. నల్లగొండ జిల్లాలోని వెంకటేశ్వర్ నగర్ (మాల్) నుంచి కోదండపూర్ వరకు గొట్టపు మార్గ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
పట్నం డివిజన్‌లో నిలిచిన పనులు
యాచారం మండల పరిధిలోని నాగార్జునసాగర్ -హైదరాబాద్ రహదారి వెంట మాల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు 21కిలోమీటర్ల మేర ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడం వల్ల గొట్టపు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సాగర్‌రోడ్డు పక్కనే గోతితీసి గొట్టపు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. కానీ గోతులుతీసే స్థలం రోడ్లు భవనాల శాఖ పరిధిలో ఉంటుంది. పను లు ప్రారంభం కాకముందే జలమండలి.. ఆర్‌అండ్‌బీకి మరమ్మతుల కోసం కిలోమీటర్‌కు రూ.80 వేల చొప్పున చెల్లించాలి. కానీ నిధులు చెల్లించకపోవడమేకాక ఆర్‌అండ్‌బీ నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. అదే సమయంలో పలు శాఖల అనుమతి కూడా పొందాల్సి ఉంది. కానీ ఆ నిబంధనలేవీ పూర్తిచేయకుండానే కాం ట్రాక్టర్లు పనులు ప్రారంభించడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు గొట్టపు నిర్మాణపు పనులు నిలిపేశారు. దీంతో మాల్-ఇబ్రహీంపట్నం మధ్య కృష్ణా పైపులైన్ పనులు నిలిచిపోయాయి. కానీ రోడ్లు భవనాల శాఖ పరిధిలోలేని ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడ ఎక్స్ రోడ్డు నుంచి రాందాసుపల్లి వరకు మాల్‌లోని కిషన్‌పల్లి రూట్లో ఉన్న బైపాస్ రోడ్డు వెంట గొట్టపు మార్గం పైపులైన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. కేవలం గొట్టపుమార్గం నిర్మాణపనులే కాకుండా కోదండపూర్ వద్ద రూ.149కోట్ల వ్యయంతో నిర్మించే 90 మిలియన్ గ్యాలన్ల నీటిశుద్ధి ప్లాంట్, రూ.24 కోట్ల వ్యయంతో నర్సర్లపల్లి, గొడుకోడ్ల, గునుగల్ వద్ద నిర్మించే 99 ఎంఎల్ సామర్థ్యం గల నీటిశుద్ధి ప్లాంట్ల పనులు సైతం నత్తనడకనే సాగుతున్నాయి. ఇంకా నీటిశుద్ధి కేంద్రాలు, పంపింగ్ కేంద్రం వద్ద యంత్రాలకు విద్యుత్ సరఫరా పనులూ చురుగ్గా సాగడం లేదు.
మూడో దశ పూర్తయితే..
ప్రస్తుతం మొదటి, రెండో దశ పనుల ద్వారా సాగర్ నుంచి 11టీఎంసీల కృష్ణా నీరు నగరానికి చేరుతోంది. మూడో దశ పనులు పూర్తయితే 5.5 టీఎంసీల నీరు సరఫరా అవుతుంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, సరూర్‌నగర్ తదితర డివిజన్‌లకు అదనంగా నీరు అందే అవకాశం ఉంది. అంతేకాకుండా గునుగల్ రిజర్వాయర్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రాంతానికి కూడా నీళ్లు సరఫరా అవుతాయి. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని 134 గ్రామాలకు నిత్యం 80-90 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. అదే మూడో దశ పనులు పూర్తయితే మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం కోటి 30లక్షల లీటర్లకుపైగా కృష్ణాజలాలు సరఫరాఅయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు సైతం పెరుగుతాయి.
అనుమతులు లేకనే: జగదీశ్వర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ
ఇబ్రహీంపట్నం డివిజన్‌లోని 21కిలోమీటర్ల పరిధిలో రోడ్డు పక్కన గొట్టపు మార్గం పనులు చేపట్టడానికి సంబంధిత శాఖల నుంచి అనుమతులు లభించలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల్లో అనుమతులు రావచ్చు. రాగానే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
కృష్ణ.. కృష్ణా..!
Published Wed, Sep 25 2013 3:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement