ఏపీకీ 47.. తెలంగాణకు 39
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు సెప్టెంబరు నెల అవసరాలకు 47 టీఎంసీలు.. తెలంగాణకు మూడు నెలల అవసరాలకు 39 టీఎంసీలు కేటాయించింది.. ఈ నీటిని రెండు రాష్ట్రాలకు విడుదల చేయడానికి సంబంధించిన షెడ్యూలును బోర్డు త్రిసభ్య కమిటీ శనివారం ఖరారు చేయనుంది.
చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరుల ద్వారా రెండు రాష్ట్రాలు వినియోగిస్తోన్న కృష్ణా జలాల లెక్కలు తేల్చేందుకు మరో త్రిసభ్య కమిటీని నియమించింది. కేఆర్‌ఎంబీ పరిధి, నిర్వహణ, అధికారాలకు సంబంధించిన డ్రాఫ్ట్(ముసాయిదా)పై వారం రోజుల్లోగా అభిప్రాయం చెప్పాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అనుమతి లేకుండా నీళ్లు వినియోగించుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జలసౌధలో ఛైర్మన్ రాంశరాణ్ అధ్యక్షతన కృష్ణా బోర్డు సమావేశమైంది.