కృష్ణా మూడోదశ పథకానికి లీకేజీల గండం పట్టుకుంది.
హైదరాబాద్ : కృష్ణా మూడోదశ పథకానికి లీకేజీల గండం పట్టుకుంది. తరచుగా లీకేజీలు ఏర్పడుతుండడంతో జనం దాహార్తిని తీర్చాల్సిన విలువైన తాగునీరు వృథా అవుతోంది. తాజాగా ఆదివారం నాసర్లపల్లి-గోడకొండ్ల(ప్యాకేజీ2) మార్గంలో కుర్మేడు వద్ద కృష్ణా మూడో దశ పైప్‌లైన్‌కు భారీ లీకేజీ ఏర్పడింది. కృష్ణా మొదటి, రెండవ దశ పైప్‌లైన్ల కంటే నూతనంగా వేసిన మూడోదశ పథకంలో పలుమార్లు లీకేజీలు ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది.
పైపుల జాయింట్లు, జంక్షన్ల పనులు పటిష్టంగా చేయకపోవడంతోనే లీకేజీలు ఏర్పడుతున్నట్లు సమాచారం. సుమారు 1,670ల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కృష్ణా మూడోదశ పథకం ద్వారా నగరానికి నిత్యం 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించాలన్న లక్ష్యం నిర్దేశించుకున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ పథకం ద్వారా నగరానికి సుమారు 50 మిలియన్ గ్యాలన్ల జలాలను సరఫరా చేస్తుండగా..ఇందులో లీకేజీల కారణంగా పలుమార్లు విలువైన మంచినీరు మట్టిపాలవుతోంది.