ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి కృష్ణా జలాలు ఏ క్షణమైనా జూరాల ప్రాజెక్టుకు చేరుకునే అవకాశంన్నందున మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టుల్లోని పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నీటి పారుదల శాఖా మంత్రి టి.హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద నిర్ణయించిన ఆయకట్టు లక్ష్యాలను ఎట్టి పరిస్ధితుల్లోనూ నీరివ్వాలని సూచించారు.
డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానల్స్ మరమ్మతులు వంటి పనులు వెంటనే పూర్తి చేసి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీని పూర్తి చేసేలా రేయింబవళ్లు పనిచేయాలని కోరారు. ఆదివారం సచివాయంలో పాలమూరు ప్రాజెక్టులపై మంత్రి అధికారులతో వీడియో కాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లు నిండనున్నందున ఆయా ప్రాజెక్టుల పరిధిలో ప్రజలకు సమాచారం చేరేలా ప్రచారం చేయాలని మహబూబ్‌నగర్ జాయింట్ కలెక్టర్‌కు సూచించారు. లక్ష్యం ప్రకారం పనులు పూర్తిచేయకపోతే 146 జీవో ప్రకారం 60శాతం బిల్లుల చెల్లింపులను నిలిపివేస్తామని మంత్రి హెచ్చరించారు. నిర్ణీత లక్ష్యాల మేరకు నీరివ్వడంలో విఫలమైతే డీఈఈ, ఏఈఈలపై చర్యలు తప్పవన్నారు.