గొర్రెలకు తోడేలు కాపలా పెట్టినట్లు ఉంది
కేసీఆర్ పాలనపై బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ధ్వజం
రామన్నపేట: కేసీఆర్ పాలన అమాయక గొర్రెలకు తోడేలును కాపలా పెట్టినట్లుగా ఉందని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రవేశించింది. ఈ సందర్భంగా రామన్నపేటలో ఏర్పాటు చేసిన సభలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రాజకీయ, ప్రజాసంఘాల నాయకులకు అపాయింట్ మెంట్ ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.
1,200 మంది విద్యార్థుల బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోగా, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. తన కుటుంబంలో మాత్రం నలుగురికి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం లక్షా 27 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉండగా ఇప్పటి వరకు కేవలం 22 వేలు మాత్రమే భర్తీ చేశారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అప్పులు రూ.60 వేల కోట్లు కాగా రెండేళ్లలో కేసీఆర్ వాటిని రెండింతలు చేశారని ఆరోపించారు.