- డిస్కంల అంచనాలకు ఈఆర్‌సీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 52,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుందని తెలంగాణ ఈఆర్‌సీ అంచనా వేసింది. కృష్ణపట్నం నుంచి 5,600 మిలియన్ యూనిట్లు, హిందూజా నుంచి 3,650 మిలి యన్ యూనిట్ల విద్యుత్తు వస్తుందని డిస్కంలు వేసిన అంచనాలకు ఈఆర్‌సీ ఆమో దం తెలిపింది. ఏపీతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల పేచీ ఉన్న కృష్ణపట్నం, హిందూజా, దిగువ సీలేరు నుంచి 53.89 శాతం విద్యుత్తు వాటా తమకే దక్కుతుందని డిస్కంలు ఏఆర్‌ఆర్‌లలో స్పష్టం చేశాయి.
జనవరి నుంచి కృష్ణపట్నం మొదటి యూని ట్ 431 మెగావాట్లు, ఏప్రిల్‌లో రెండో యూనిట్ నుంచి మరో 431 మెగావాట్లు సమకూరుతుంది. ఏప్రిల్ 15 నుంచి హిందూజా మొదటి యూనిట్ ద్వారా 280 మెగావాట్లు, జులై 15 నుంచి రెండో యూనిట్ ద్వారా 280 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని డిస్కంలు ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. వీటిని పరిశీలించి ఆమోదం తెలిపినట్లుగా ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ వెల్లడించారు. ఏపీ ఇచ్చే విద్యుత్తు వాటాలు తీసుకోవాలా.. వద్దా.. అని రాష్ట్ర ప్రభుత్వం వెనుకా ముందాడుతున్న తరుణంలో ఈఆర్‌సీ అనుమతి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.