కృష్ణపట్నంలో మినీ హార్బర్‌ | Nellore District: Fishing Harbor in Juvvaladinne, Krishnapatnam Mini Harbor | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నంలో మినీ హార్బర్‌

Published Sat, Apr 30 2022 5:59 PM | Last Updated on Sat, Apr 30 2022 6:39 PM

Nellore District: Fishing Harbor in Juvvaladinne, Krishnapatnam Mini Harbor - Sakshi

ఆటుపోట్ల మధ్య జీవనం సాగించే కడలి పుత్రులు ప్రాణాలను పణంగా పెట్టి ఎగసి పడే అలలను దాటుకుని సముద్రంలో వేట సాగిస్తేనే కడుపులు నిండుతుంది. ప్రకృతి విపత్తులు, వేట నిషేధిత కాలంలో రోజుల తరబడి వాటిని భద్రపరుచుకోవడం తలకు మించిన భారంగా మారింది. దీంతో పాటు వేట సమయంలో రోజుల తరబడి సముద్రంలో రెక్కలు ముక్కలు చేసుకుని మత్స్య సంపదను ఒడ్డుకు చేర్చినా నిల్వ చేసుకునే పరిస్థితులు లేక దళారులకు తెగనమ్ముకునే పరిస్థితి నెలకొంది. ఈ దయనీయ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని కృష్ణపట్నం తీర మండలాల మత్స్యకారులు ఎంతోకాలంగా కోరుతున్నారు. ఇప్పటికే సుమారు రూ.288 కోట్లతో జిల్లాలో జువ్వలదిన్నె వద్ద భారీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చివరి దశలో ఉంది. తాజాగా కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం తెరపైకి వచ్చింది. ఈ దిశగా అధికారులు పరిశీలన చేస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా పరిధిలోని ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం తీరంలో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. 14 ఏళ్ల క్రితం కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందు ఇక్కడి జెట్టీల కేంద్రంగా మత్స్యకారులు సముద్రంలో చేపలవేట చేపట్టారు. వలలకు చిక్కిన మత్స్య సంపదను ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడం ద్వారా వందల మంది మత్స్యకారులు జీవనోపాధి పొందారు. కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైన తర్వాత జెట్టీలు అదృశ్యమయ్యాయి. ఇక్కడి మెకనైజ్డ్‌ బోట్లు ఇతర రేవులకు తరలిపోయాయి. ఎక్కడికీ వెళ్లలేని మోటారు బోట్లు, నాన్‌ మోటారు బోట్లు మాత్రం నానా కష్టాల మధ్య సముద్రంలో వేట సాగిస్తున్నాయి. వేటాడిన తర్వాత మత్స్యసంపదను అపరిశుభ్ర వాతావరణంలో ఎండబెట్టుకుంటూ, అమ్మకాలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. 

15 ఏళ్ల క్రితమే సర్వే 
కృష్ణపట్నం పోర్టు ప్రారంభానికి ముందే బెంగళూరుకు చెందిన ఓ సంస్థ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై ఈ ప్రాంతంలో సర్వే జరిపింది. ఉప్పు కాలువలో పడవల ద్వారా పర్యటించిన నిపుణులు హార్బర్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు అవసరమైనట్టు ప్రాథమిక అంచనాలు రూపొందించారు. అయితే, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. 1996లో తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టును నాట్కో అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. కాగా, ఆ సంస్థ ఒక్క ఇటుక కూడా వేయలేకపోయింది. 2004లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పోర్టును నాట్కో సంస్థ నుంచి నవయుగ సంస్థకు అప్పగించారు. కేవలం నాలుగేళ్ల వ్యవధిలో ఈ సంస్థ పోర్టు నిర్మాణం పూర్తి చేసింది. ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలన్న అంశానికి అప్పుడే బీజం పడింది.  

ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటైతే.. 
కృష్ణపట్నం తీరంలో ఏర్పాటు కావల్సిన ఫిషింగ్‌ హార్బర్‌ తర్వాత బోగోలు మండల పరిధిలోని జువ్వలదిన్నెకు తరలించారు. రూ.288 కోట్లతో చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. పూర్వ నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెన్నాయపాళెం నుంచి తడ వరకూ 169 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉంది. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి 1.05 లక్షల (చేప, రొయ్యలు కలిపి) టన్నులపైగానే మత్స్య సంపదను కడలి గర్భం నుంచి బయటకు తీస్తున్నారు. ఇందులో కేవలం 40 శాతం మాత్రమే విదేశాలకు ఎగుమతి అవుతోంది. సరైన వసతులు, స్టోరేజీ సామర్థ్యం లేని కారణంగా మిగిలిన 60 శాతం సరుకు దళారుల చేతుల్లో పడుతోంది.

మత్స్యకారుల నుంచి అతి తక్కువ ధరకు చేపలు, రొయ్యలను సొంతం చేసుకుంటున్న దళారులు చెన్నై, బెంగళూరు వంటి రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేవలం 40 శాతం ఎగుమతులపైనే ఏడాదికి జిల్లా నుంచి రూ.200 కోట్లు విదేశీ మారకం వస్తున్నట్లు అధికారుల అంచనా. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్, కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్‌ చేపడితే జిల్లాలో ప్రస్తుతం లభిస్తున్న 1.05 లక్షల టన్నులు రెట్టింపు మత్స్య సంపదను మత్స్యకారులు చేజిక్కించుకునే అవకాశం ఉంది. తద్వారా విదేశీ మారకద్రవ్యం రెట్టింపు కానుందని నిపుణులు వివరిస్తున్నారు.  

మరింత వెసులుబాటు 
కృష్ణపట్నం పోర్టు సమీపంలో మినీ హార్బర్‌ ఏర్పాటైతే కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట, సర్వేపల్లి పరిధిలోని తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరు మండలాల మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉంటుంది. మినీ హార్బర్‌ నిర్మాణంతో మత్స్యకార మహిళలకు సైతం సమృద్ధిగా జీవనోపాధి లభిస్తుంది. తద్వారా ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు వివరిస్తున్నారు. 

ఉపాధి అవకాశాలు పెరుగుతాయి 
మినీ హార్బర్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. సముద్రతీరం వెంబడి మత్స్యకారులు అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడుతుంది. వారికి ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. మార్కెట్‌ వంటి వసతులు చెంతకు వస్తాయి.  
– పామంజి నరసింహ, జిల్లా ఆక్వా సొసైటీ డైరెక్టర్‌ 

మత్స్యకారులకు ఎంతో మేలు 
ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. అధునా«తన, బోట్లు, వలలతో వేటాడే అవకాశం ఉంటుంది. దీంతో మత్స్య సంపద పెరగడంతో పాటు ఎగుమతులకు మంచి అవకాశం ఉంటుంది. తీరం వెంబడి ఉన్న గంగపుత్రులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.  
– శ్రీహరికోట శ్రీనివాసులు, మైపాడు తూర్పుపాళెం కాపు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement