సాక్షి, సిరిసిల్ల: కౌలు రైతులకు సాయం చేసేందుకు రైతులే చొరవ తీసుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు కోరారు. రైతుకు, కౌలు రైతుకు మధ్య తగువు పెట్టే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని, అందుకే వారి మధ్య జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురువారం రైతుబంధు కార్యక్రమం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. యాదవులు కేటీఆర్‌కు గొర్రెపిల్ల, గొంగడిని బహూకరించారు.
గత పదేళ్లలో ఎమ్మెల్యేగా తాను అనేక కార్యక్రమాలకు హాజరవుతున్నా రైతుకు సాయం అందించే రైతుబంధు కార్యక్రమం అత్యంత సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. రైతుల కోసం చేస్తున్న గొప్ప పథకాన్ని ఎన్నికల కోసమే అంటూ కొందరు కారుకూతలు కూస్తున్నారని, సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని 13 నెలల కిందటే ప్రకటించారని అప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉన్న రాజకీయ రహితమైన ప్రశాంత వాతావరణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.
రుణమాఫీని ఒక్క దఫాలోనే పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ఆర్బీఐ ఒప్పుకోలేదని దానిపై సంతృప్తి లేకనే ఆయన రైతుబంధును చేపట్టాలని నిర్ణయించుకున్నారని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న పంటల బీమా పథకం లోపభూయిష్టమైనదని, అందుకే జూన్ 2 నుంచి రైతులకు బీమా పథకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తూ రైతులను మంత్రి పేరుపేరున పలకరించి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment