వైద్య ఖర్చులు తగ్గుతాయి | KTR inaugarates medical devices park | Sakshi
Sakshi News home page

వైద్య ఖర్చులు తగ్గుతాయి

Published Sun, Jun 18 2017 1:36 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్య ఖర్చులు తగ్గుతాయి - Sakshi

వైద్య ఖర్చులు తగ్గుతాయి

- మెడికల్‌ డివైజెస్‌ పార్కు ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌
- త్వరలో 2 అంతర్జాతీయ పార్కులతో ఒప్పందం
- 250 ఎకరాల్లో తొలి దశ పార్కు.. భవిష్యత్తులో మరో 200 ఎకరాలకు విస్తరణ
- తొలిరోజే 14 కంపెనీలకు భూ కేటాయింపులు.. రూ.425.29 కోట్ల పెట్టుబడులు
- 4 వేల మందికి ప్రత్యక్షంగా, 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి


సాక్షి, హైదరాబాద్‌: ‘‘ప్రజలకు ఉపయోగపడని పరిజ్ఞానం నిష్ఫలమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అంటుంటారు. ఉత్పత్తి, పరిశ్రమల స్థాపనతోపాటు వైద్య పరికరాల తయారీని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ మెడికల్‌ డివైజెస్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నాం. మనలాంటి దేశాల్లో వైద్యం కోసం సామాన్య ప్రజలు చేస్తున్న ఖర్చులను తగ్గించే దిశగా ఈ పారిశ్రామికవాడలో పరిశోధనలు జరుగుతాయి. పరిశోధనలకు కావాల్సిన వాతావరణం సృష్టించేం దుకు ఇక్కడ ప్రయోగశాలతోపాటు ప్రొటోటైపింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటవుతాయి’’అని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. పరిశోధనల కోసం త్వరలో రెండు ప్రముఖ అంతర్జాతీయ వైద్య పరికరాల పార్కులతో ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నామని చెప్పారు.

వైద్య పరికరాల రంగంలో పరిశోధనలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని ఎప్పటిప్పుడు ఇచ్చిపుచ్చుకునేందుకు చైనాలోని మెడికల్‌ సిటీతోపాటు కొరియాలోని గాంగ్వాన్‌ ప్రావిన్స్‌లోని మెడికల్‌ పార్కుతో ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని ముందుకు వెళ్లడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయన్నారు. శనివారం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామంలో 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మెడికల్‌ డివైజెస్‌ పార్కును మంత్రి టి.హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్‌ సంకల్పం మేరకు దేశంలోనే అతిపెద్ద వైద్య పరికరాల పార్కును రాష్ట్రంలో నెలకొల్పామన్నారు. తొలి దశ కింద 250 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయగా, భవిష్యత్తులో మరో 200 ఎకరాల్లో విస్తరింపజేయడానికి అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం మనదేశం 75 శాతం వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని ఈ పార్కుతో రానున్న రోజుల్లో పూర్తిస్థాయి వైద్య పరికరాలు ఇక్కడే తయారవుతాయని, చికిత్స ఖర్చులు చాలావరకు తగ్గుతాయన్నారు.

మొదటిరోజే 14 సంస్థలకు స్థలం..
పార్కును కేవలం ప్రారంభోత్సవానికే పరిమితం చేయకుండా మొదటి రోజే 14 సంస్థలకు పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలం కేటాయించినట్లు కేటీఆర్‌ చెప్పారు. తొలిరోజే 4 వేల మందికి ప్రత్యక్ష, మరో 8 వేల మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు సృష్టించామన్నారు. మంత్రి హరీశ్‌ సూచించినట్లు ఇక్కడి పరిశ్రమల్లో స్థానికులకే సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్‌ ఉద్యోగాలను కల్పించేందుకు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామన్నారు.

స్థానికంగా చదువుకున్న యువతకు స్కిల్డ్‌ ఉద్యోగాల్లో సైతం అవకాశం కల్పించేందుకు టాస్క్‌ ద్వారా శిక్షణ ఇస్తామన్నారు. మూడేళ్లలోనే రాష్ట్రం ఆందోళనపథం నుంచి పరిపాలన పథంలోకి మారడం, ఇంత త్వరగా ఈ మార్పు రావడం సామాన్య విషయం కాదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ ఇటీవల ప్రశంసించారని గుర్తుచేశారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పారిశ్రామిక రంగం పురోగమిస్తోందని పేర్కొన్నారు.

కేటీఆర్‌పై హరీశ్‌ ప్రశంసల వర్షం
మెడికల్‌ డివైజెస్‌ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌పై సహచర మంత్రి హరీశ్‌ రావు ప్రశంసల వర్షం కురిపించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్‌ ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టమని కొనియాడారు. కేటీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం పరిశ్రమల రంగంలో ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతోందన్నారు. సీడ్‌ పార్కు, గ్రానైట్‌ పార్కు, వుమెన్‌ ఇండస్ట్రియలిస్ట్‌ పార్కు, మెడికల్‌ డివైజెస్‌ పార్కు, టీ హబ్‌ ఇలా ఎన్నో కొత్త ఆలోచనలతో కేటీఆర్‌ పనిచేస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉండడం, పారిశ్రామికంగా పురోగమిస్తుండడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.

ఈ పార్కుతో విదేశాల నుంచి వైద్య పరికరాల దిగుమతి తగ్గుతుందని, దీంతో దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. త్వరలోనే పటాన్‌చెరు నియోజకవర్గంలోని జిన్నారంలో 170 ఎకరాల్లో ఎల్‌ఈడీ బల్బుల తయారీ కేంద్రం రానుందని, నెల రోజుల్లో దీన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎల్‌ఈడీ పార్కు, మెడికల్‌ డివైజెస్‌ పార్కులకు భూసేకరణ త్వరగా పూర్తి చేసేందుకు హరీశ్‌ బాగా కృషి చేశారని కేటీఆర్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ డివైజెస్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 14 సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకోవడంతోపాటు స్థల కేటాయింపులకు సంబంధించిన పత్రాలను వారికి అందజేశారు.

రెండేళ్లలో ఉత్పత్తి యూనిట్‌: బీవీఆర్‌ మోహన్‌రెడ్డి, సైయంట్‌ లిమిటెడ్‌
మేకిన్‌ ఇండియా ద్వారా దేశానికి 350 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వస్తాయి. అందులో 15 శాతం రాష్ట్రానికి వచ్చినా.. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఈ 15 శాతంలో 7 శాతం మెడికల్‌ డివైజెస్‌ పార్కుకు వచ్చే అవకాశం ఉంది. వచ్చే 24 నెలల్లో ఇక్కడ మేం కూడా ఓ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పుతాం.

హైదరాబాద్‌లో తప్ప ఎక్కడా పెట్టుబడులు పెట్టను: పార్థసారథి రెడ్డి, హెటిరో ఫార్మా
నేనో శాస్త్రవేత్తను. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు తిరిగాను. పెట్టుబడులకు హైదరాబాద్‌ చాలా అనుకూలం. ఇక్కడ తప్ప మరెక్కడా పెట్టుబడులు పెట్టను.

తొలిరోజు రూ.425 కోట్ల పెట్టుబడులు
మెడికల్‌ డివైజెస్‌ పార్కులో రూ.425.29 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు 14 కంపెనీలు ముందుకు వచ్చాయి. 250 ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయగా, అందులో పరిశ్రమలకు 160 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నారు. తొలిరోజు ఈ 14 కంపెనీలకు 52 ఎకరాలను కేటాయించగా.. 3,915 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశం లభించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement