ప్రజా రక్షణకు ప్రాధాన్యం | KTR launches EVDM's Disaster Response Force wing | Sakshi
Sakshi News home page

ప్రజా రక్షణకు ప్రాధాన్యం

Published Sun, Aug 5 2018 12:38 AM | Last Updated on Sun, Aug 5 2018 8:11 AM

KTR launches EVDM's Disaster Response Force wing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో ప్రజా రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని మునిసిపల్‌ మంత్రి కేటీ రామారావు అన్నారు. అనుకోని విపత్తులు... ఆకస్మిక ప్రమాదాలు జరిగినప్పుడు అన్ని శాఖలు సమన్వయంతో వెంటనే స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీలో డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌(డీఆర్‌ఎఫ్‌)ను ఏర్పాటు చేశామన్నారు.

జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) డైరెక్టరేట్‌ ఆధ్వర్యంలో డీఆర్‌ఎఫ్‌ విభాగాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలోనే డీఆర్‌ఎఫ్‌ను ఏర్పా టు చేసిన తొలి నగరం హైదరాబాదేనన్నారు. ముంబై తరువాత ఈవీడీఎం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ జీహెచ్‌ఎంసీయే అన్నారు.

అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినప్పుడు, వర దలు ఇతరత్రా ప్రమాద సమయాల్లో అన్ని శాఖలు సమన్వయంతో ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా డీఆర్‌ఎఫ్‌ పనిచేస్తుందని చెప్పారు. గత నాలుగేళ్లలో నగరంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందంటూ, ఇదే అంశాన్ని మినిస్టర్‌ ఆఫ్‌ హోం అఫైర్స్‌(ఎంహెచ్‌ఏ) నివేదిక స్పష్టం చేసిందన్నారు. నగరాన్ని సేఫ్‌ సిటీగా మార్చేందుకు 10 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యం కాగా,  ఇప్పటి వరకు 4 లక్షలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.

భవనం కూలిన దుర్ఘటనతోనే..
నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలోని భవనం కూలి పలువురు మృత్యువాత పడటం తననె ంతో కలచివేసిందని, ఆ సమయంలోనే నగరంలో శాస్త్రీయ పద్ధతిలో విపత్తులను ఎదుర్కొనే డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిపారు. దీని కోసం ఈవీడీఎంను ఏర్పాటు చేసి డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ను నియమించామన్నారు.

ప్రస్తుతం డీఆర్‌ఎఫ్‌లో 120 మంది శిక్షణపొందిన సిబ్బంది ఉన్నారని, ఈ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. ప్రజల ‘రైట్‌ టు వాక్‌’అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం నగరంలోని 8వేలకు పైగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు తొలగించిందన్నారు.

వినూత్న కార్యక్రమాల జీహెచ్‌ఎంసీ..
దేశంలోనే పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జీహెచ్‌ఎంసీ ప్రత్యేకతను చాటుకుంటోందన్నారు. బాండ్ల ద్వారా నిధు లు సేకరించాలన్న ప్రధాని సూచన మేర కు రూ. 200 కోట్లు సేకరించగా, త్వరలోనే మరో రూ. 200 కోట్లు సేకరించనున్నట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సీఎం సూచనల మేరకు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మరిన్ని సర్కిళ్లు, జోన్లు, మానవ వనరులను పెంచనున్నట్లు తెలిపారు.

మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సిన్హా, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, హైదరాబాద్‌ మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు.

నగరంలో వరదలు, చెట్లు పడిపోవడం, నిర్మాణాలు కూలిపోవడం వంటి ఘటనలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై 120 మందికి పోలీస్‌శాఖ, సెంట్రల్‌ ఎమర్జెన్సీ టీంలతో శిక్షణ ఇచ్చాం. వీరితో నేషనల్‌ ఇండస్ట్రీ సెక్యూరిటీ అకాడమీ, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అకాడమీల నుంచి సర్టిఫికెట్‌ కోర్సులు చేయిస్తాం. ప్రత్యేక వాహనంలో ఐదుగురు సిబ్బందితోపాటు పంప్‌లు, సబ్‌మెర్జబుల్స్, కట్టర్లు, హ్యామర్లు తదితర పరికరాలుంటాయి. ఇప్పుడున్న సిబ్బంది సామర్థ్యంతో 5 నుంచి 10 నిమిషాల్లో చేరుకునేలా చర్యలు చేపడుతున్నాం.   – విశ్వజిత్, డైరెక్టర్, ఈవీడీఎం.

ఆపదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేలా మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మా వద్ద ఉన్న సామగ్రితో ఎలా ప్రమాద తీవ్రతను తగ్గించాలనే విషయాలను నేర్పించారు. ఇలాంటి విభాగంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది.    – టి.ప్రభాకర్, మహ్మద్‌ మోయిస్, శివ బృందం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement