జపాన్‌లో భారత రాయబారితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: జపాన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్‌తో ఆదివారం మర్యా దపూర్వకంగా సమావేశమయ్యారు. జపాన్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను ఆయనకు కేటీఆర్ వివరించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు.
సుజయ్ చినాయ్ మాట్లాడుతూ, జపాన్‌లోని ఒకటిరెండు నగరాలతో సిస్టర్‌సిటీ ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. చిన్నతరహా పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి సారించాలన్నారు. జపాన్ కంపెనీలకు కావాల్సిన సిబ్బంది సరఫరా, శిక్షణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. భారత రాయబారి సూచనలకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.