మంత్రి ఈటల రాజేందర్, కేటీఆర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ మరింత కీలకం కానున్నారు. ప్రభుత్వ పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణం విషయాల్లో ఇప్పటికే బిజీ బిజీగా ఉన్న వారు.. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీ అధినేత వారికే మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉందన్న చర్చ పార్టీవర్గాల్లో సాగుతోంది. ‘ఎప్పుడెన్నికలొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి. నలుగురైదుగురు మినహా ‘సిట్టింగ్’లకే టిక్కెట్లు ఇస్తాం. ఆయా జిల్లాల్లో మంత్రులు మరింత కీలకంగా వ్యవహరించాలి’ అంటూ సీఎం కేసీఆర్ ఇటీవలే అప్రమత్తం చేశారు.
దీంతో ముందస్తు ఎన్నికలు దాదాపుగా ఖాయమన్న చర్చ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ వర్గాల్లో జోరందుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశం అత్యంత గోప్యంగా జరిగినప్పటికీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ప్రధానంగా ముందస్తు ఎన్నికలు వస్తే ఆచరించే వ్యూహం, సెప్టెంబర్‌లో ప్రగతి నివేదన సభ, అభ్యర్థుల ప్రకటనపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అయితే.. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు రెండు లక్షల మందిని తరలించాలన్నది లక్ష్యం. ఈ మేరకు సీఎం కేసీఆర్‌తో సమావేశం ముగిసిన అనంతరం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో సమావేశమయ్యారు.
అక్టోబర్‌లో షెడ్యూల్..? సెప్టెంబర్‌లోనే అభ్యర్థులు..
ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలపై ఈ సమావేశంలో ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ సెప్టెంబరు నెలాఖరు, అక్టోబర్ మొదటి వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతున్న విషయం విదితమే. అక్టోబర్ మొదటి వారంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండగా, వాటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న ప్రచారం కొంతకాలంగా సాగుతోంది. దీనికితోడు పది రోజుల కిత్రం సీఎం కేసీఆర్ సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు కూడా. ఇదే సమయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పలు సూచనలు పార్టీ కేడర్‌లో చర్చనీయాంశాలుగా మారాయి.
ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టిక్కెట్లు ఇస్తామంటూనే, అవసరమైతే నలుగురైదుగురిని మార్చుతామని కూడా పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల మంత్రు లే కీలకంగా వ్యవహరించాలని, ఎక్కడైనా పోటీ అధికంగా ఉంటే అక్కడ ప్రత్యామ్నాయ పదవులు, అవకాశాలు కల్పించే విషయమై చర్చించాలని కూడా ఆయన సూచించారు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ కీలకం కానున్నారు. కాగా.. ప్రగతి నివేదన సభకు భారీగా జనం తరలించే బాధ్యతలను తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో భేటీ అయినట్లు చెప్తున్నారు.
టార్గెట్ ‘ప్రగతి నివేదన’ సభ.. నేడో రేపో ఉమ్మడి జిల్లాలో సమీక్షలు..
ముందస్తు ఎన్నికలు, అభ్యర్థుల ప్రకటన ఒక ఎత్తైతే సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభ నిర్వహణ ఇప్పుడు కీలకంగా మారింది. ఎన్నికలు తాము అనుకున్నంత దూరంలో లేకపోవడం, ప్రగతి నివేదిక సమర్పించే సమయానికి తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, పార్టీ పరిస్థితిపై అధిష్టానం అంచనాలు ఎలా ఉండబోతున్నాయోననే ఆందోళ న అధికార ఎమ్మెల్యేలకు పట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలుండగా, అందులో 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లా బాధ్యతలను మంత్రులకే అప్పగించడంతో మొదటగా ప్రగతి నివేదన సభకు జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ నుంచి 2.50 లక్షల మందిని సమీకరించాలనేది లక్ష్యం కాగా, మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన ఆయన ఇంట్లో జరిగిన సమావేశంలో జనసమీకరణ, తరలింపుపై చర్చించారు.
ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులతోపాటు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు కూడా ఈ జన సమీకరణ బాధ్యతలు అప్పగించారు. అధిష్టానం ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ కోసం నేడో రేపో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. కాగా.. శుక్రవారం మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు ఒడితెల సతీష్‌బాబు, రసమయి బాలకిషన్, రమేశ్‌బాబు, దాసరి మనోహర్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, పోలీస్ హౌజింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment