టీఆర్‌ఎస్ వైపు మాధవరం చూపు!
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేరిస్తే టీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ను ఎన్టీఆర్ భవన్‌లో కలసిన మాధవరం పార్టీ తెలంగాణ నేతల తీరుపై ఫిర్యాదు చేశారు.
బీసీ కులాల జాబితా నుంచి తొలగించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26 కులాల విషయంలో యథాతథస్థితి కొనసాగించాలని తాను అసెంబ్లీలో ప్రస్తావించినా టీడీపీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు రాలేదని, ఎవరికి వారే ఎప్పుడు టీఆర్‌ఎస్‌లో చేరుదామా అనే ఆలోచనలో ఉన్నారని, అందరూ ఆ పార్టీతో టచ్‌లో ఉన్నారని లోకేశ్‌కు తెలిపారు.
తెలంగాణలో పార్టీ బతకాలని టీ నాయకులెవరికీ లేదని, ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారని చెప్పారు. ‘నాకు పార్టీ మారే ఆలోచన లేదు...మన పార్టీ వారే అలా ప్రచారం చేస్తున్నారు. ఆ ఆలోచనే ఉంటే మిమ్మల్ని ఎందుకు కలుస్తాను’ అని లోకేశ్‌కు వివరించినట్టు సమాచారం.