అవగాహన లోపం.. రైతులకు శాపం..! | lack of awareness is curse of farmers | Sakshi
Sakshi News home page

అవగాహన లోపం.. రైతులకు శాపం..!

Published Wed, May 28 2014 12:16 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

lack of awareness is curse of farmers

 పరిగి, న్యూస్‌లైన్:  ఎరువుల వాడకంలో రైతుల్లో అవగాహన లోపించింది. నేలల స్వభావం, భూసారాన్ని బట్టి ఎరువులను వినియోగించాల్సి ఉండగా రైతులు ఆ విషయూన్ని పట్టించుకోవడం లేదు. రైతుల కోసం చైతన్య యాత్రలు, అవగాహన సదస్సులు, పొలంబడి తదితర అనేక కార్యక్రమాలు వ్యవసాయ శాఖ చేపడుతున్నప్పటికీ అన్నదాతలకు ఈ విషయుమై ప్రాథమిక సమాచారం కూడా అందిన దాఖలాలు కనిపించడం లేదు.

 జిల్లాకు చెందిన నేలల భూసారం, నేల స్వభావాన్ని బట్టి ఈ ప్రాంతంలో డీఏపీని(అడుగు మందు) దుక్కిలోనే వేయాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా ఐదుశాతం రైతులు కూడా ఈ విధానాన్ని పాటించడం లేదు. కేవలం పసుపు, మొక్కజొన్న పంటలకు మాత్రమే డీఏపీనీ రైతులు దుక్కి మందుగా వాడుతున్నారు. డీఏపీని కూడా యూరియా వూదిరి పైపాటి ఎరువుగా వాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యవసాయు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎరువుల వినియోగంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం..

 మోతాదుకు మించి డీఏపీ వాడకం
 నేల స్వభావం, భూసారంపై రైతులకు అవగాహన లేకపోవడంతో డీఏపీని రైతులు మోతాదుకు మించి వాడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చివు జిల్లాలోని నేలల్లో భాస్వరం మధ్యస్తంగా, పొటాషియం ఎక్కువగా, నత్రజని తక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంత నేలలను బట్టి ఎకరానికి పంటకాలంలో 50 కేజీల డీఏపీ మాత్రమే వాడాలని శాస్త్రవేత్తలు చెబుతుండగా రైతులు ఎకరానికి 100 నుంచి 150 కేజీల వరకు డీఏపీని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా ఈ మందును పైపాటుగానే వేస్తున్నందునా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 నియోజక వర్గంలో ఇలా వాడుతున్నారు
 రెండు మూడు సంవత్సరాలుగా పరిగి నియోజక వర్గానికి ఖరీఫ్ ఆరంభంలోనే 4 వేల నుంచి 5 వేల టన్నుల ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు సరఫరా చేస్తూ వస్తున్నారు. ఇందులో మెజార్టీ భాగం డీఏపీనే ఉంటోంది. కాగా సరఫరా అవుతున్న ఎరువుల్లో 20 శాతం కూడా జూలై మాసంలో వాడటంలేదు. అంటే విత్తుకునే సమయంలో దుక్కి ఎరువుగా రైతులు డీఏపీని వాడటంలేదని అర్థవువుతోంది. జిల్లా భూముల సారాన్ని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎరువుల మోతాదు ఈ విధంగా ఉండాలని పేర్కొంటున్నారు.

 డీఏపీ ఎరువు ప్రతి ఎకరానికి 50 కిలోలు వాడాలి. దీన్ని తప్పని సరిగా దుక్కి ఎరువుగానే వాడాలి. డీఏపీలో భాస్వరం ఎక్కువగా ఉన్నందునా ఈ ఎరువును పైపాటుగా వేస్తే ఉపయోగం ఉండదు. పత్తి పంటకు విత్తే కంటే ముందు మూడు నుంచి నాలుగు అంగులాల లోతులో డీఏపీ వేయాలి. మిగత అన్ని ఖరీప్‌పంటలకు కూడా ఎకరానికి 50 కేజీలే వాడాలి.

యూరియా ప్రతి ఎకరానికి వందకిలోలు వాడాలి. ఈ ప్రాంతంలో నత్రజని శాతం తక్కువగా ఉన్నందునా యూరియా మోతాదు ఎక్కువగా వాడాలి. యూరియాను పైపాటు ఎరువుగా వాడవచ్చు. పత్తికి యూరియా విత్తిన 20 రోజుల నుంచి ఐదుసార్లు వాడాలి. వాడిన ప్రతి సారి 30 కేజీల వరకు వేయవచ్చు. వరికి యూరియా నాలుగు సార్లు వాడాలి. కలుపుతీసే సమయంలో తరువాత 20 రోజులకు, 30 రోజులకు, 50 రోజులకు యూరియాను వరి పైరుకు వాడాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement