ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఖాతా ఖాళీ!
ఆరు నెలలుగా నిధులు విదల్చని సర్కారు
సిబ్బంది వేతనాలకూ కటకట
వడ్డీ డబ్బులతో గత నెల వేతనాలు సరిపెట్టుకున్న వైనం
ఆందోళనలో రెండువేల మంది ఉద్యోగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ఆరు నెలలుగా నిధులలేమితో సతమతమవుతోంది. బడ్జెట్ కేటాయింపులో సమస్య నెలకొనడంతో చివరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి పంచాయతీ పరిధిలో ఉపకేం ద్రాలు ఏర్పాటుచేసి అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించడంతోపాటు ప్రజారోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఆశ వర్కర్లు, శిశు మరణాలు తగ్గించేందుకు ప్రత్యేకంగా క్లస్టర్ ఆస్పత్రుల్లో శిశు వైద్య యూనిట్లు ఏర్పాటుచేసి సేవలందిస్తున్నారు.
వేతన వెతలు..
ప్రస్తుతం ఎన్‌ఆర్‌హెచ్‌ఎం పథకంలో భాగంగా పనిచేస్తున్న సిబ్బందికి కష్టాలు వచ్చాయి. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కింద జిల్లాలో రెండు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో ఆశ, ఇతర వర్కర్లు 1,506 మంది కాగా, 483 మంది ఆరోగ్య కార్యకర్తలు, సహాయ ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు కూడా ఉన్నారు. తాజాగా ఈ పథకం కింద విడుదల చేయాల్సిన నిధులపై సర్కారు జాప్యం చేస్తోంది. కొత్తగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలవుతున్నా ఇప్పటికీ పైసా విదిల్చలేదు. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఖాతాలో రూ.రెండు కోట్ల మిగులు డబ్బులున్నాయి. దీంతో ఏప్రిల్ నెలనుంచి ఆ నిధులనుంచి వేతనాలు తీసుకుంటూ వచ్చారు.
తాజాగా ఈ ఖాతాలో నిధులు నిండుకోవడంతో సిబ్బందిలో ఆందోళన మొదలైంది.ఈ పథకం అమల్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలవారీగా రూ.70లక్షలు వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేసింది. దీంతో మిగులు నిధులతో మూడు నెలలపాటు వేతనాల రూపంలో డ్రా చేశారు. ఫలితంగా నిధులు నిండుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మూడు నెలల తర్వాత కూడా బడ్జెట్ రాకపోవడంతో మళ్లీ వేతనాల సమస్య తలెత్తింది. అయితే ఎన్‌ఆర్‌హెచ్‌ఎం ఖాతాలోని వడ్డీ నిధులను సైతం వాడుకుని రెండు నెలల వేతనాలు ఇచ్చారు. తాజాగా ఈ ఖాతా ఖాళీ కావడంతో సిబ్బందికి వేతనాలు అందడం కష్టంగా మారింది.