మెదక్ జిల్లా సిద్దిపేటలోని మస్తానాబాద్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి హరీష్ రావు.
సిద్ధిపేట జోన్ (మెదక్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కేసీఆర్ సారధిగా వ్యవహరించినప్పటికీ ఉద్యమ నిర్దేశకుడు మాత్రం దివంగత ప్రొఫెసర్ జయశంకరే అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలోని మస్తానాబాద్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. తన జీవితం మొత్తాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేసిన గొప్పమనిషి జయంశంకర్ సార్ అని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ సురేష్, ఆర్డీవో ముత్యం రెడ్డి, మెదక్ జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, సిద్దిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, జేఏసీ రాష్ట్ర ప్రతినిధి, ఆర్ అండ్ బీ ఈఈ బాల్నర్సయ్య, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు పాపయ్య, ఓఎస్డీ బాల్రాజు తదితరులు పాల్గొన్నారు.