ఆదిలాబాద్ క్రైం : సాధారణంగా లా అండ్ ఆర్డర్ పేరు చెప్పగానే నేరాలు చేసే వారిలో వణుకుపుడుతుంది. నేరం చేయాలన్న ఆలోచన కూడా రాదు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు కాపాడే పోలీసుల చేతుల్లో ఉండాల్సిన లా అండ్ ఆర్డర్ ఇప్పుడు జిల్లాలో కొంత మంది అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చేతుల్లోకి వెళ్లిపోతోందనే ఆందోళన కలుగుతోంది. శాంతిభద్రతల విషయంలో పక్షపాతం లేకుండా బాధితులకు న్యాయం చేసి.. బాధ్యులకు శిక్ష పడేలా చేయడమే లా అండ్ ఆర్డర్ పని. కానీ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా రోజురోజుకూ పోలీసుల కేసుల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతోంది. ఒకప్పుడు తప్పు చేసే వారికి పోలీసులంటే భయం ఉండేది.
కానీ ప్రస్తుతం తాము ఏ కేసులోనైనా తప్పు చేసినా తమను విడిపించేందకు నాయకులున్నారనే నమ్మకం వారిలో పెరిగిపోయిది. అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో ఒకే వర్గానికి, నేరం చేసిన వారికి మద్దతు తెలిపి పోలీసులపై ఒత్తిడి తేవడం సరైంది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. దీంతో ఎదుటి వ్యక్తికి న్యాయం జరుగదు. ప్రస్తుతం జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలోనైతే ఇలాంటి సంఘటనలకు అంతులేకుండా పోతోందని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.
చోటామోటా నాయకులదే పెత్తనం..
జిల్లాలోని ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఒక చిన్న కేసు నమోదైతే చాలు.. ఆ వెంటనే సంబంధిత పోలీసు అధికారికి ఫోన్లు వస్తున్నాయి. ఎలాంటికేసైనా సరే అందులో తమవారున్నారని.. వెంటనే విడుదల చేయాలని హెచ్చరించడం పరిపాటి. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల కంటే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులే ఎక్కువగా అధికారం చెలాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కటేమిటి.. ట్రాఫిక్, ఆర్టీవో నిబంధనలు పాటించని వాహనదారుడికి జరిమానా వేసినా.. ఘర్షణల్లో తోటి వారిపై దాడి చేసినా.. పేకాట ఆడుతూ దొరికిపోయినా.. అక్రమ మద్యం విక్రయిస్తున్నా.. మరే కేసుల్లోనైనా అందులో ఉండే బాధ్యులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వారుంటే చాలు..
కేసు పక్కతోవ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పు తమదేనని తెలిసినా.. కేసులో పేరు ఉండకూడదని పోలీసులకు ఫోన్‌లు రావడం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. సంబంధిత పోలీసు అధికారి కేసు విషయంలో రాజీపడని పక్షంలో అధికారంలో ఉన్నామని కొంత మంది చోట నాయకులు హెచ్చరిస్తుండడం శోచనీయం. చిన్నచిన్న కేసుల్లో జోక్యం చేసుకుంటుండడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎఫ్‌ఐఆర్‌లో నమోదైన కేసులను సైతం తీసేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారంటే పరిస్థితి ఎలా తయారైందో చెప్పనక్కర్లేదు.
రాజకీయ జోక్యం ఎందుకు..?
పోలీసు కేసుల్లో రాజకీయ జోక్యంతో బాధితుడికి న్యాయం జరగకపోగా.. నేరస్థులు కేసు నుంచి తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. పోలీసులు మనవారే ఉన్నారనే ధైర్యంతో కొంత మంది నాయకులు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నచిన్న తగదాల్లో జోక్యం చేసుకొని పోలీసు స్టేషన్‌లకు వచ్చిన వారిని విడిపించేందుకు అధికార పార్టీ నాయకులు కొం దరు ప్రయత్నించడంతో సామాన్యులకు న్యాయం జరగడం లేదు. పోలీసులు సైతం ఇలాంటి కేసుల్లో చేతులె త్తేస్తున్నట్లు తెలుస్తోంది.
చట్టాన్ని శాసించి..
చట్టం ఎవరికీ చుట్టం కాదు.. ఇది పోలీసు వ్యవస్థలో ప్రతిఒక్కరూ చెప్పే మాటే. కానీ ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం మారుతున్న పరిస్థితులను బట్టి చూస్తే చట్టం పోలీసుల చేతుల్లోంచి.. రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోననే భయం సామాన్య ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. పోలీసు వ్యవస్థలో చట్టాన్ని శాసించే స్థాయిలో రాజకీయ జోక్యం జరుగుతుండడం బాధాకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసు వ్యవస్థలో రాజకీయ జో క్యం లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
లా అండ్ ఆర్డర్‌లో రాజకీయ జోక్యం
Published Wed, Mar 4 2015 3:30 AM | Last Updated on Mon, Sep 17 2018 4:58 PM
Advertisement
Advertisement