పంద్రాగస్టుకు మెట్రో పరుగు..! | LB Nagar Ameerpet Metro Starts On 15th August | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 23 2018 2:27 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

LB Nagar Ameerpet Metro Starts On 15th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిష్టాత్మక హైదరాబాద్‌ మెట్రో రైలు మరో రూట్లో పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజైన ఆగస్టు 15న ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌(17 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇక అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో అక్టోబర్‌లో.. ఎంజీబీఎస్‌–జేబీఎస్‌ రూట్లో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని మెట్రో వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నాగోల్‌–అమీర్‌పేట్‌–మియాపూర్‌(30 కి.మీ.) మార్గంలో మెట్రో రైళ్లు నడుస్తుండగా.. నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. 

తప్పిన ఆర్‌వోబీ చిక్కులు.. 
మెట్రో రైళ్ల రాకపోకల కోసం 8 రైల్వే ఓవర్‌ బ్రిడ్జీల(ద.మ.రైల్వే పట్టాలపైన ఏర్పాటు చేసినవి) నిర్మాణం పూర్తవడంతో మూడు మార్గాల్లో మెట్రో పరుగుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. అత్యంత కీలకమైన బోయిగూడా ఆర్‌వోబీ నిర్మాణం ఇటీవల పూర్తయ్యింది. ఈ ఆర్‌వోబీ నిర్మాణంతో జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో మెట్రో పనులకు మార్గం సుగమమైంది. బోయిగూడా ఆర్‌వోబీని హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ భారీ స్టీలు వంతెనను అనేక వ్యయప్రయాసలకోర్చి నిర్మించామన్నారు.

ఈ ప్రాంతంలో మెట్రో రైలు ట్రాక్‌ అత్యంత ఒంపు తిరిగిందని.. దీంతో 64 అడుగుల వెడల్పు.. 221 అడుగుల పొడవున ఈ బ్రిడ్జీని ఏర్పాటు చేశామన్నారు. ఈ వంతెన రహదారికి 40 అడుగుల ఎత్తున ఉందని, బాక్సు ఆకృతిలో దీనిని నిర్మించడం ద్వారా ఈ రూట్లో మెట్రో పరుగుకు అవకాశం కల్పించామన్నారు. ఈ స్టీలు వంతెనను ఘజియాబాద్‌లో తయారు చేశామని, ముక్కలుగా స్టీలు ప్లేట్లను తీసుకొచ్చి దశలవారీగా వారధిని 51 వేల హైస్ట్రెంత్‌ ఫ్రిక్షన్‌గ్రిప్‌ బోల్టులతో నిర్మించామన్నారు. ముందుగా వారధిని నిర్మించి.. హైడ్రాలిక్‌ జాక్‌లు, గైడింగ్‌ రోలర్ల సహాయంతో ముందుకు తీసుకెళ్లి నిర్ణీత ప్రదేశంలో వంతెనను అమర్చామని, దీంతో వంతెన నిర్మాణ సమయంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించగలిగామని చెప్పారు. ఈ సందర్భంగా వారధి కోసం పనిచేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. 


బోయిగూడా వంతెన సాకారమైందిలా.. 
అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో ప్రత్యేక పరిస్థితులు, వినూత్న డిజైన్లతో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న ఉక్కు ప్లేట్లను అధిక కచ్చితత్వంతో ఒకదానితో మరోటి జత చేశారు. ఇందుకోసం ఎత్తైన ప్రదేశాల్లో పనిచేసే నైపుణ్యంగల సిబ్బందిని నియమించారు. వంతెన నిర్మాణానికి పరిమిత స్థలంలో అధిక సామర్థ్యం ఉన్న క్రేన్లను చాకచక్యంగా ముందుకు కదిల్చారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ఏర్పాటు చేసిన ఆరు వరుసల ద.మ.రైల్వే పట్టాలపైన ఈ ఉక్కు వంతెనను నిర్మించారు. ద.మ.రైల్వే ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌ వైర్లు అత్యంత సమీపంలో ఉన్నా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా  వంతెన నిర్మాణం పూర్తి చేశారు.

బోయిగూడా వంతెన విశేషాలివే..
స్టీలు వారధి పొడవు                                           :     221 అడుగులు 
స్టీలు వారధి వెడల్పు                                          :     64 అడుగులు 
వంతెన పిల్లర్ల ఎత్తు                                             :     1,417 అడుగులు 
ద.మ.రైల్వే పట్టాల పైనుంచి బ్రిడ్జీ ఎత్తు                    :   30 అడుగులు 
వంతెనను కదిల్చేందుకు వాడిన జాక్‌ల బరువు       :   ఒక్కోటి వంద టన్నులు 
వర్టికల్‌ లిప్టింగ్‌ జాక్‌ బరువు                                 :     300500 టన్నులు 
మొత్తం వారధి బరువు                                      :    960 మెట్రిక్‌ టన్నులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement