ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని తుమ్మిడి హెట్టి వద్ద నిర్మిస్తున్న ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరంకు తరలించే ఉద్దేశ్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రాణహిత ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు శుక్రవారం ప్రజాయాత్రను చేపట్టారు. మంచిర్యాల నుంచి తుమ్మిడిహట్టి వరకు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు సాగు, త్రాగునీరు అందించడంతో పాటు జంట నగరాలకు నీరందుతుందన్నారు.
కాని మహారాష్ట్ర అభ్యంతరం చెబుతుందన్న కుంటిసాకుతో జిల్లాకు ప్రాజెక్టు రాకుండా తెలంగాణ ప్రభుత్వం కుట్రపన్నుతుందని ఆరోపించారు. జిల్లాలో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నా, జిల్లా రైతులకు సాగునీరందడం లేదని ఆరోపించారు. ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరంకు తరలించే కుట్రపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు నైనాల గోవర్దన్, రాజేశం, రాజబాబు, శ్రీనివాస్, రాందాస్, మల్లేశ్ పాల్గొన్నారు.
(మంచిర్యాల రూరల్)