బోనగిరి సురేశ్, పోచక్క
తాండూర్(బెల్లంపల్లి) : ఒకే కుటుంబంలోని ఇద్దరు హఠాన్మరణం చెందడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గంటల వ్యవధిలోనే ఆ ఇద్దరిని మృత్యువు గుండెపోటుతో కబలించడం తీరని శోకాన్ని మిగిల్చింది. తాండూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి బోనగిరి సురేశ్ (63) బుధవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు సురేశ్‌కు స్థానికంగా ప్రథమ చికిత్స నిర్వహించి మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరేలోపు సురేశ్ మృతి చెందాడు.
ఈ మరణ వార్త తెలుసుకున్న అతని అన్న కమలాకర్ భార్య బోనగిరి పోచక్క (68), ఆమె కుమారుడు మురళితో కలిసి ఆసిఫాబాద్ నుంచి తాండూర్‌కు వచ్చారు. సురేశ్ భౌతికకాయాన్ని చూసేందుకు పోచక్క ఇంట్లోకి వెళ్తున్న క్రమంలోనే గుమ్మం వద్దే గుండెపోటుతో కుప్పకూలింది. ఇది గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే పోచక్క తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందింది. మరిది మరణాన్ని విని ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోవడంతో వారి బంధువర్గం శోకసంద్రంలో మునిగిపోయారు. పోచక్క భర్త కమలాకర్ రిటైర్డ్ ఎంఈవోగా విధులు నిర్వహించి గతంలోనే మృతి చెందాడు.
పలువురి పరామర్శ
తాండూర్ మండల కేంద్రానికి చెందిన సురేశ్ ప్రముఖ వ్యాపారిగానే కాక లయన్స్ క్లబ్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించాడు. లయన్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా, కోశాధికారిగా పలు పదవులు చేపట్టిన ఆయన స్వచ్ఛందంగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోనేవాడు. ఆయన మరణవార్త విని స్థానికులు పెద్ద ఎత్తున సురేశ్ ఇంటికి తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
జెడ్పీటీసీ మంగపతి సురేశ్‌బాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సల్వాజి మహేందర్‌రావు, సర్పంచులు కాపర్తి సుభాష్, గడ్డం మణికుమార్, ఎంపీటీసీ సిరంగి శంకర్, మాజీ సర్పంచ్ సాలిగామ భానయ్య, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సత్యనారాయణ, సంగీతరావు, సంతోష్‌లతోపాటు పలువురు సురేశ్ మృతి పట్ల ఆయనకుటుంబీలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment