సాక్షి. హైదరాబాద్: రాష్ట్రంలో మితవాద, అతివాద, ఇతర కమ్యూనిస్టు పార్టీలన్నింటినీ కలుపుకొని లెఫ్ట్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలన్న యోచనను పలు వామపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో పోటీ చేయడంపై సైద్ధాంతికంగా విభేదాలు, అభిప్రాయభేదాలు ఉన్నందున ఇది సాధ్యం కాదని స్పష్టం చేశాయి. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తొమ్మిది వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విస్తృత ప్రాతిపదికన అన్ని కమ్యూనిస్టు పార్టీలను ఒక వేదికపైకి తీసుకువద్దామని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించగా.. మిగతా వామపక్షాలు వ్యతిరేకించినట్లు సమాచారం.
ప్రజా సమస్యలు, ముఖ్యమైన అంశాలపై కలిసి ఉద్యమాలు చేయడం మినహా.. ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని ఆయా పార్టీల నాయకులు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్, బీజేపీ వంటి బూర్జువా పార్టీల అనుబంధ రైతు విభాగాలు, ఎన్జీవో రైతు సంఘాలు లేకుండా తెలంగాణ రైతు సంఘాల జేఏసీని ఏర్పాటు చేసుకోవాలన్న అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. దీనిపై ఈనెల 24న సమావేశమై తుదినిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 5 వేల ర్యాంకు వరకే పరిమితం చేయాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులందరికీ పూర్తి ఫీజు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వామపక్షాల నేతలు నిర్ణయించారు. ఇక అన్ని వామపక్షాలకు ఆమోదయోగ్యుడైన అభ్యర్థిని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీకి నిలపాలని భేటీలో భావన వ్యక్తమైంది. మరోవైపు ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం నేపథ్యంలో అవినీతి అంశంపై శనివారం పది వామపక్షాల సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీలో చాడ వెంకటరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ), ఝాన్సీ (న్యూడెమోక్రసీ-రాయల), గుర్రం విజయ్‌కుమార్ (సీపీఐ-ఎంఎల్) తదితరులు పాల్గొన్నారు.
లెఫ్ట్ ఫ్రంట్‌కు నో!
Published Fri, Jun 19 2015 2:47 AM | Last Updated on Wed, Aug 29 2018 9:12 PM
Advertisement
Advertisement