
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) తీరుతెన్నులపై పెద్దల సభ అయిన శాసన మండలి ఆందోళన వ్యక్తం చేసింది. అడ్డూ అదుపూ లేకుండా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతోందని, దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చట్టాలు తేవాలని అభిప్రాయపడింది. గురువారం మండలిలో సభ్యులు ఫారూక్ హుస్సేన్, నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ సోషల్ మీడియా పట్ల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా సమాచారం పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడిన వాటిని కూడా వక్రీకరించి ప్రజల్లోకి పంపుతున్నారని అన్నారు. గూగుల్, వాట్సాప్‌లాంటి సామాజిక మాధ్యమాలు విదేశీ కంపెనీలకు చెందినవని, ఆ దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేశారని, మన దేశ చట్టాలకు అనుగుణంగా ఆ కంపెనీలు వ్యవహరించేలా నియంత్రణ చట్టం తెచ్చినప్పుడే కొంతమేర అరికట్ట వచ్చని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల తరహాలోనే ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యుల ఆందోళనకు స్పందించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో సోషల్ మీడియా నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment