సాక్షి, మెదక్‌జోన్: రెండు సంవత్సరాలుగా చిరుతపులి ఇప్పటి వరకు 67 జీవాలను హతమార్చింది. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా 67 జీవాలను హతమార్చగా అందులో మేకలు, లేగదూడలు, దూడ్డెలున్నాయి. పంట పొలాల వద్ద పశువుల పాకలో కట్టేసిన జీవాలే లక్ష్యంగా చంపుకుతింటుంది. ముఖ్యంగా మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో ఈ పులి వేట సాగుతోంది. ఇందులో ఒక్కో బాధితుడికి రూ. 1,500 నుంచి రూ. 2,000 వేల వరకు పరిహారం చెల్లించగా ఆవుదూడలు, దూడ్డెలకు రూ. 3వేల నుంచి 10వేల వరకు పరిహారాన్ని అటవీ అధికారులు చెల్లించారు.
ప్రతి యేటా అటవీ అభివృద్ధికి వచ్చే బడ్జెట్‌లో సగం చిరుతపులి చంపుకుతినే జీవాల బాధితులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మృతి చందిన వాటిలో ఇప్పటి వరకు 62 జీవాలకు పరిహారం చెల్లించగా, మరో ఐదింటికి చెల్లించాల్సి ఉంది. చిరుతను బంధించేందుకు గతేడాదిగా ఫారెస్ట్ అధికారులు చేయని ప్రయత్నం లేదు. పులులను బంధించే నిష్ణాతులైన శిక్షణ పొందిన వారిని హైదరాబాద్ నుంచి రప్పించి రామాయంపేట అడవుల్లో అనేక చోట్ల బోన్లను సైతం ఏర్పాటు చేశారు.
దానికి మేకలు, దూడలను ఎరవేసినప్పటికీ ఆ పులి అటవీ అధికారుల కళ్లుగప్పి తిరుగి బోనుకు చిక్కని పరిస్థితి. రెండు నెలలుగా స్తబ్దుగా ఉన్న చిరుత ఇటీవల మళ్లీ రెచ్చిపోయి వేట మొదలుపెట్టింది. ఇటీవల చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్‌లో పశువుల మందపై దాడి చేసి దూడెను ఎత్తుకెళ్లింది. ఇలా నిత్యం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో ఈ చిరుత సంచరిస్తుందని తెలుస్తోంది. గుర్తించిన అధికారులు దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒంటరి జీవాలే టార్గెట్..
బోరుబావులు, పంటపొలాల వద్ద ఒంటరిగా కట్టేసే లేగదూడలు, మేకలు ఆవుదూడలను చంపుకుతింటుంది. ఎక్కువ శాతం ఊరికి చివరలోని పంటపొలాల్లో కట్టేసినవాటినే టార్గెట్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు గ్రామాల్లో చొరబడి జీవాలను చంపిన దాఖాలాలు లేవు. కాగా రైతులు నిత్యం పంటపొలాల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నందున వారు పాడిపశువులను అక్కడే కట్టేస్తారు. ఈ క్రమంలో పులి వాటిని వెంటాడి చంపుతుండడంతో ఒంటరిగా పంటపొలాల వద్దకు వెళ్లాలంటేనే బాధిత మండలాల రైతులు
జంకుతున్నారు.
ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం..
చిరుతపులి ఎక్కువగా ఊరు బయట కట్టేసిన జీవాలపై మాత్రమే దాడి చేసి చంపుకుతింటుంది. కాగా పశువులు, మేకలను ఊరి చివర కాకుండా గ్రామాల్లోనే కట్టేయాలి. ఇప్పటి వరకు చిరుత 67 జీవాలను చంపింది. 62 జీవాలకు రూ. 4.5లక్షల పరిహారం చెల్లించాం. చిరుతను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. –పద్మజారాణి, అటవీ శాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment