
హైదరాబాద్: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో ‘టాటా సేవా డేస్ 2017’ వేడుకలు గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ..తెలంగాణ అభివృద్ధి, సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించేందుకు టాటాను నెలకొల్పామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ‘సేవా డేస్’ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగుల పంపిణీ, దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటుతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఇదీ షెడ్యూల్
ఈ నెల 15న కర్నూలు జిల్లా సున్నిపెంట, 16న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, 19న రంగారెడ్డి జిల్లా జుక్కల్, నల్లగొండ జిల్లా ఆత్మకూరు గ్రామాల్లో, 20న వరంగల్, 21న నిజామాబాద్ జిల్లాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 23న టాటాతో పాటుగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్, మధ్యాహ్నం శిల్పకళా వేదికలో కవి సమ్మేళనం ఉంటాయన్నారు. ఈ వేడుకల్లో భాగంగా సినీ నటుడు కృష్ణకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వయిజరీ బోర్డు సభ్యుడు మోహన్ పట్లోల, కార్యక్రమ సమన్వయకర్త వంశీరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట్ ఎక్కా, సంయుక్త కోశాధికారి జ్యోతిరెడ్డి, సమన్వయకర్త ద్వారక్‌నాథ్ రెడ్డి, జి.బి.కె.రెడ్డి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment