సాక్షి, సిటీబ్యూరో: భారతదేశంలో ప్రఖ్యాత సితార్ విద్యాంసుల్లో పండిట్ జనార్దన్ మిట్టా ఒకరు. స్వయంకృషితో ఎదిగిన హిందూస్థానీ సంగీత సాధకుడాయన. ఆరు దశాబ్దాలుగా సినీ, శాస్త్రీయ సంగీత రంగాలకు సేవ చేసిన జనార్దన్.. కళా నిలయమైన హైదరాబాద్‌లోనే జన్మించారు. చిన్న వయసులోనే సితార్‌పై మక్కువ పెంచుకుని ఎవరి శిక్షణ లేకుండానే సంగీతంపై పట్టు సాధించారు. ఆనాటి దక్కన్ రేడియోలో బాల కళాకారుడిగా కచేరీలు కూడా ఇచ్చారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ వద్ద మెలకువలు నేర్చుకుని దక్షిణాదిన తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. సంగమం ఆధ్వర్యంలో అరవై వసంతాల సంగీత వేడుకల సందర్భంగా లైఫ్‌టైం ఎచీవ్‌మెంట్ అవార్డు అందుకొనేందుకు ఇటీవల రవీంద్రభారతికివచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు.
విదేశాల్లో సంగీత ప్రయాణం..
పండిట్ జనార్దన్ శాస్త్రీయ రంగంలో గాయకి, తంత్రకారి శైలులు రెండింటిపై పట్టు సాధించిన అరుదైన కళాకారుడిగా పేరు పొందారు. దేశ విదేశాల్లో పర్యటించి హిందూస్తానీ కచేరీలు చేశారు. వి.రాఘవన్, టీఎన్ కృష్ణన్, ఎం చంద్రశేఖరన్ , టీవీ గోపాలకృష్ణన్, కన్యాకుమారి, ఉస్తాద్ షేక్ దావూద్, జాకీర్ హుస్సేన్ వంటి సంగీత దిగ్గజాలతో జుగల్బందీలనూ, ఫ్యూషన్ సంగీత కచేరీలు చేశారు. అమెరికా, యూకే, యూరప్, ఫ్రాన్స్, బెల్జియం, పోలాండ్, జర్మనీ, శ్రీలంక, వెస్టిండీస్, సింగపూర్ వంటి దేశాల్లో తన సితార్ కచేరీలతో ప్రేక్షకులను మైమరపించారు. 1971లో న్యూయర్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేశారు. పండిట్ రవిశంకర్ తర్వాత ఐక్యరాజ్య సమితిలో కచేరీ చేసిన వాద్య కళాకారుడు మన జనార్దన్ మాత్రమే. 1976లో తిరువాయూరులో జరిగిన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కచేరీ చేసిన తొలి హిందూస్థానీ వాద్య కళాకారుడిగా ప్రత్యేకతను పొందారు. కంచి కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠాల ఆస్థాన విద్వాన్‌గా సేవలందించారు.
సాదర స్వాగతం పలికిన సినీ ప్రపంచం..
జనార్దన్ మిట్టా ప్రతిభను గుర్తించిన సినీ ప్రపంచం సాదరంగా ఆహ్వానించింది. 1958లో భాగ్యదేవత చిత్రంలోని పాటలకు సితార్‌ను వాయించడంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఎస్. రాజేశ్వరావు మొదలుకొని ఏఆర్ రెహమాన్ వరకు దక్షిణాది అన్ని భాషల సంగీత దర్శకుల దగ్గర ప్రధాన సితార్ వాద్యకారుడిగా పనిచేశారు. దక్షిణాది భాషలతో పాటు పలు హిందీ, బెంగాలీ, ఒరియా, సింహళ సినీ గీతాలలో కూడా తన సితార్ మెరుపులు మెరింపించారు. తన ఆరు దశాబ్దాల సినీ జీవితంలో దాదాపు ముప్పైవేల పాటలకు సితార్ వాద్య సహకారాన్ని అందించి రికార్డు సృష్టించారు. ఎన్నో వందల చిత్రాల రీరికార్డింగ్‌ల్లో సన్నివేశాలకు తన సితార్ నాదంతో జీవం పోశారు. తెలుగులో రంగుల కల, అగ్ని సంస్కారం, మలయాళంలో ఎసైప్పన్, సంస్కార్ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. బ్లిస్, శ్రీశైలం, యాభై వసంతాల ఉస్మానియా యూనివర్సిటీ వంటి లఘు చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారు. కథలు సమాజాన్ని ప్రభావితం చేయాలి
కమల్‌హాసన్ నటించిన మాటలు లేని పుష్పక విమానం చిత్రంలో తెర వెనుక జనార్దన్ సితార్ ఎన్నో భావాలను పండించింది. ఇక చరిత్రలో నిలిచిపోయే ఘంటసాల భగవద్గీతలో కూడా జనార్దన్ తన సితార్ వాదనతో అమరత్వాన్ని అద్దారు.
ఎన్నెన్నో పురస్కారాలు ...
మద్రాస్ సినీ మ్యూజిషియన్స్ యూనియన్‌కు అధ్యక్షుడిగా, ట్రస్ట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారాన్ని, సంగీత కళాభారతి, సంగీత శిరోమణి, సితార్ చక్రవర్తి, సితార్ సమ్రాట్ వంటి ఎన్నో బిరుదులు, అవార్డులు అందుకున్నారు. తాను నెలకొల్పిన విశ్వకళా సంగమ సంస్థ ద్వారా కళారూపాలనూ, కళాకారులనూ ప్రోత్సహిస్తున్నారు. ‘ఎన్నెన్నో పురస్కారాలు అందుకొని హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అరవై వసంతాల సంగీత జీవిత వేడుకల సందర్భంగా పొందిన టైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డు (స్వర్ణ కంకణం) జీవితంలో మరువలేను. భాగ్యనగరంతల్లిలాంటింది. వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడినా హైదరాబాద్‌కు వస్తే తల్లిదండ్రుల వద్దకు వచ్చినట్లు ఉంటుంది. ఈ నేల, ఈ గాలి, ఈ వాతావరణం ఎప్పుడూ మరువలేను. హైదరాబాద్‌కు ఎంత చేసినా పుట్టిన గడ్డ రుణం తీర్చుకోలేనిది’ అన్నారు ఆయన.
Comments
Please login to add a commentAdd a comment