కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకంకోసం...
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం కోసం చేపడు తున్న భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరుతూ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సామాజిక ప్రభావ అంచనా చేపట్టకుండానే ప్రభుత్వం భూసేకరణ చేస్తోందని రైతులు కె.వెంకట్రామ్ రెడ్డి, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. భూముల మార్కెట్ ధరలను సవరించకుండానే ప్రభుత్వం భూములు తీసుకుంటోందని పిటిషనర్లు వివరించారు.
భూ సేకరణ నోటిఫికేషన్ జారీ అయినందున, 60 రోజుల్లో భూములు అప్పగించాలని.. లేనిపక్షంలో పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేసి స్వాధీనం చేసుకుంటామని అధి కారులు బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును కోరారు. భూ సేకరణకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని అభ్యర్థించారు. మరోవైపు జగిత్యాల మండలాన్ని జగిత్యాల, జగిత్యాల రూరల్‌గా విభజిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 363ను సవాలు చేస్తూ ధరూర్ గ్రామ సర్పంచ్ జలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.