ఆ రెండు గంటలు..
ఆదిలాబాద్ రిమ్స్ : రిమ్స్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి భయటపడింది. రిమ్స్ ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్ శనివారం రాత్రి సమయంలో ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో అందులో ఉన్న బాధితుడు సుమారు రెండు గంటల పాటు నరకం అనుభవించాడు. వివరాల్లోకి వెళ్తే... ఇచ్చోడకు చెందిన కరుణాకర్ అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య విజయమాలను తీసుకొని శనివారం ఉదయం రిమ్స్‌కు తీసుకొచ్చాడు. సాయంత్రం 6 గంటల సమయంలో రెండో అంతస్థుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కాడు. ఒక్కసారిగా లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఏమైందో తెలి యని అయోమయంలో బాధితుడు అలాగే ఉండిపోయాడు. సుమారు రెండు గంటల పాటు అందులోనే గడిపాడు. రిమ్స్‌లోనే ఉన్న బంధువు లు ఫోన్ చేయడంతో అసలు విషయం తెలిసింది.
తాను లిఫ్ట్‌లో ఉండిపోయానని చెప్పడంతో స్థానికుల సహాయంతో మెకానిక్‌లను పిలిపించి లిఫ్ట్ ఓపెన్ చేయించారు. ఈ విషయం తెలుసుకున్న కరుణాకర్ భార్య విజయమాల లిఫ్ట్ దగ్గరకు వచ్చి గంటపాటు వేచిచూడడంతో భయాందోళనకు గురై సృహ కోల్పోయి పడిపోయింది. దీంతో ఆమెను ఎమ్మర్జెన్సీ వార్డుకు తరలించగా వైద్యులు పరీక్షలు చేసి మమూలు స్థితి కి తీసుకొచ్చారు. కాగా కనీసం రిమ్స్‌లో ఉన్న నాలుగు లిఫ్ట్‌లో రెండే పనిచేస్తున్నాయని, అందులో కూడా సిబ్బందిని ఉంచకపోవడంతో రిమ్స్‌కు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
కేవలం ఉదయం మా త్రమే ఒక సిబ్బంది లిఫ్ట్ పనిచేస్తుండగా.. మధ్యాహ్నం నుంచి ఎవ్వరు ఉండడం లేదని, రాత్రి సమయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. 24 గంటల పాటు లిఫ్ట్‌లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని పలువురు కోరుతున్నారు.