మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో నాటు సారా తయారీ జోరుగా సాగుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు మొక్కుబడిగా మారడంతో సారా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మంచాల మండలం నాటు సారా తయారీ, విక్రయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాకుండా మండలం సరిహద్దులోని నారాయణపూరం, యాచారం, మర్రిగూడెం మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న గిరిజన తండాల్లో నాటుసారా ఏరులై పారుతోంది.
మండలంలోని పటేల్ చెర్వు తండా, బుగ్గ తండా, ఎల్లమ్మ తండా, ఆంబోత్ తండా, సత్తితండా, సల్లిగుట్ట తండా, దాద్‌పల్లి తండా, వెంకటేశ్వర తండా, నారాయణపూరం మండలంలోని రాచ కొండ తండా, కడీలబావి తండా, దుబ ్బగడ్డ తండాల నుంచి సారాను మండలంతోపాటు ఇబ్రహీంపట్నం, నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళ్లల్లో ఆర్టీసీ బస్సుల్లోనే ఈ సారాను తరలిస్తుండటం గమనార్హం. సమీప ప్రాంతాల్లోకి మాత్రం స్కూటర్లు, బైక్‌ల ద్వారా సారా రవాణా కొనసాగుతోంది.
ఆరుట్లలో ముడిసరుకులు
సారా తయారీకి వినియోగించే ముడిసరుకులకు ఆరుట్ల అడ్డాగా మారింది. ఇక్కడ కొందరు వ్యాపారులు సారా తయారీకి కావాల్సిన ముడి సరుకులను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో లారీల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి నల్ల బెల్లం, పట్టిక వంటి సరుకులను తీసుకొచ్చి ఈ గ్రామంలో నిల్వచేస్తున్నారు. ఇక్కడినుంచి ఆయా గ్రామాల వ్యాపారులు లేదా సారా తయారీదారులు ముడిసరుకులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గతంలో పలుమార్లు ఆరుట్లలో అధికారులు దాడులు చేసి సరుకులతోపాటు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు స్తబ్దుగా ఉన్న వ్యాపారులు మళ్లీ తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు.
ప్రాణాలు కబళిస్తున్న సారా మహమ్మారి
పచ్చని పల్లెల్లో సారా మహమ్మారి చిచ్చుపెడుతోంది. సారా తాగడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీన్ని పక్కనబెడితే అనేకమంది సారాకు బానిసలుగా మారి ప్రాణాలను తీసుకుంటున్నారు. కేవలం ఆరుట్ల గ్రామంలోనే సారా మహమ్మారి బారినపడి 25 మంది మృతిచెందారు. వీరిలో కొందరు సారా తాగి చనిపోగా మరికొందరు సారా ప్రభావంతో అస్వస్థతకు గురై మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. జాపాల కూడా మూడేళ్ల వ్యవధిలో పదిమందిని సారా పొట్టనపెట్టుకుంది.
మండలంలో ఈస్థాయిలో సారా తయారీ కొనసాగుతున్న అధికారులు మిన్నకుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు నిద్రపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ తుక్యా నాయక్‌ను మాట్లాడుతూ.. సారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దాడులు మరిం త ముమ్మరం చేసి సారా తయారీని అడ్డుకుంటామన్నారు.
జోరుగా సారా తయారీ
Published Thu, Aug 14 2014 11:54 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement
Advertisement