- షాపు సీజైన యజమానిని వెంట తీసుకువచ్చిన విప్ సునీత
- లాబీలోకి ఎలా వచ్చావంటూ యజమానిపై మంత్రి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్టలో నాలుగు మద్యం షాపులను సీజ్ చేసిన వ్యవహారం అసెంబ్లీ లాబీల్లో సోమవారం చర్చనీయాంశమైంది. ఇటీవల ఎక్సైజ్ అధికారులు చేసిన దాడుల సందర్భంగా నాలుగు మద్యం షాపుల్లో 500 కేసుల ఎన్‌డీపీ (నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం దొరికింది. దీంతో అధికారు లు ఆ నాలుగు షాపులతో పాటు వాటికి రింగ్ లీడర్‌గా ఉన్న వ్యక్తికి చెందిన మద్యం షాపును సీజ్ చేశారు.
ఈ ఐదు మద్యం దుకాణాలకు మళ్లీ టెండర్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సోమవారం విప్ సునీత సదరు వ్యాపారిని వెంటబెట్టుకుని అసెంబ్లీ లాబీల్లోకి వచ్చి.. ఎక్సైజ్ మంత్రి పద్మారావును కలిశారు. సీజ్ చేసిన షాపును తెరిపించాలని కోరారు. దీంతో అది కుదరదంటూ మంత్రి సున్నితంగానే సమాధానమిచ్చారు. కానీ తన నియోజకవర్గం కార్యకర్త, పార్టీ కోసం కష్టపడిన ఆ వ్యక్తికి చెందిన వైన్‌షాపును ఎక్సైజ్ అధికారులు అన్యాయంగా సీజ్‌చేశారని, మళ్లీ తెరిపించాలని ఆమె మరోసారి పద్మారావును కోరారు. అయితే ఎక్సైజ్‌శాఖ పనిలో తాను జోక్యం చేసుకోబోనని మంత్రి తేల్చి చెప్పారు.
అయినా వైన్‌షాపు ఓనర్ అసెంబ్లీ లాబీలోకి ఎలా వచ్చాడని ప్రశ్నించారు. తానే పాస్ ఇచ్చి తీసుకొచ్చినట్లు సునీత చెప్పడంతో మద్యం వ్యాపారిపై పద్మారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మూసేసిన షాప్‌ను తెరిపించాలంటూ మరోసారి ఎవరితోనైనా చెప్పిస్తే పీడీ యాక్టు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించారు.
మంత్రి (తాను) పనిచేయడం లేదని సీఎంకు చెప్పినా ఫర్వాలేదని సునీతతో వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదే సమయంలో అక్కడే ఉన్న మీడియాతోనూ మంత్రి కొద్దిసేపు తమ శాఖ అంశాలపై మాట్లాడారు. నాలుగేళ్ల కిందట బీర్ల ధరలు పెంచారని, దీనికోసం నియమించిన కమిషన్ కూడా బీర్ల ధరలు పెంచాలని సూచించిందని మంత్రి పద్మారావు చెప్పారు.