పాదేశిక పోరు | local body elections | Sakshi
Sakshi News home page

పాదేశిక పోరు

Published Tue, Mar 11 2014 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

local body elections

 పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
 17న జడ్పీటీసీ, ఎంపీటీసీలకు నోటిఫికేషన్
 ఆ రోజు నుంచి 20 వరకు నామినేషన్లు
 ఏప్రిల్ 6న ఎన్నికలు..8న కౌంటింగ్
 
 ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:
 పంచాయతీరాజ్ ఎన్నికల సైరన్ కూడా మోగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఆ రోజు నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
 
 21న నామినేషన్ల పరిశీలన, 22 సాయంత్రం 5 గంటల వరకు వాటిపై అభ్యంతరాలు, 23న అభ్యంతరాల తిరస్కరణ ఉంటాయి. 24న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఏప్రిల్ 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 8వ తేదీ ఉదయం 8 గంటలకు
 ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం గెలుపొందిన వారి జాబితాను ప్రకటిస్తారు. జడ్పీ చైర్మన్, ఎంపీపీలను కూడా అదే రోజు ఎన్నుకునే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో సుమారు నెల రోజుల పాటు ‘స్థానిక’ సందడి నెలకొననుంది.
 
 చురుగ్గా ఏర్పాట్లు ...
 రాష్ట్ర ఎన్నికల క మిషన్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లా పరిషత్ అధికారులు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు 15 వేల మంది సిబ్బంది అవసరమని అంచనా వేస్తున్నారు. వీరికి తోడు జిల్లాలో 46 మంది రిటర్నింగ్ అధికారులుగా ఎంపీడీఓ పైస్థాయి అధికారులను నియమించాలని కమిషన్ ఆదేశించింది. అలాగే 92 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించనున్నారు. వీరంతా ఎంపీడీవో, తహశీల్దార్ కేడర్‌లో ఉంటారు. జిల్లా వ్యాప్తంగా 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. 2006లో 592 ఎంపీటీసీ, 46 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఆసంఖ్య 640కి పెరిగింది. పోలింగ్ స్టేషన్‌ల జాబితాను ఈనెల 12 లోగా పూర్తిచేయాలని, ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ విధానంతో నిర్వహించనున్నారు. గతంలో 1865 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఈసారి 1945కు పెరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహ ణకు 4900 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు.
 
 సిద్ధమవుతున్న బ్యాలెట్ పేపర్లు ...
 జిల్లా వ్యాప్తంగా 46 జడ్పీటీసీ, 640 ఎంపీటీసీల ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేస్తున్నారు. జడ్పీటీసీ అభ్యర్థులకు తెలుపు, ఎంపీటీసీలకు పింక్ (ఊదా) రంగు బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. తెలుపు బ్యాలెట్‌లు 9,350, పింక్ బ్యాలెట్‌లు 9,350 మెట్రిక్ టన్నుల చొప్పున అవసరం ఉంటుందని, ఈ మేరకు ఇప్పటికే అందుబాటులో ఉంచామని జడ్పీ అధికారులు తెలిపారు. పార్టీ బీ ఫాం ఉన్న అభ్యర్థులకు పార్టీ గుర్తులు, స్వతంత్ర అభ్యర్థులకు ఇతర గుర్తులతో బ్యాలెట్‌లు ముద్రించనున్నట్లు చెప్పారు.
 
 ఎన్నికల బడ్జెట్ రూ.2.85 కోట్లు...
 జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు రూ. 2.85 కోట్లు ఖర్చు అవుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. బ్యాలెట్‌ల ముద్రణ, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల టీఏ, డీఏ, సిరా(ఇంక్), వాహనాల ఏర్పాటుకు ఈ బడ్జెట్ నుంచే ఖర్చు చేస్తారు. గత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు రూ.2 కోట్లు ఖర్చయింది.
 
 రిజర్వేషన్ల ఖరారు .....
 జిల్లాలోని 640 ఎంపీటీసీలు, 46 జడ్పీటీసీలు, 46 ఎంపీపీలు, జడ్పీ చైర్మన్‌ల రిజర్వేషన్ జాబితాను పంచాయతీరాజ్ శాఖాధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా 18,36,837 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  జడ్పీ సీఈవో జయప్రకాష్ నారాయణ జిల్లా పరిషత్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల బాధ్యతలను అప్పగించారు.  
 
 ఎన్నికలపై ప్రత్యేక నిఘా...
 స్థానిక సంస్థల ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పటిష్ట ఏర్పాట్లు చేయనున్నారు. ఆయా మండలాల స్థాయిలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించనున్నారు. ఇందుకోసం మండల పరిధిలోని ఎస్సై, ఎంపీడీవో, తహశీల్దార్‌తో కమిటీ వేయనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కెమెరా, వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించేలా చర్యలు తీసుకోనున్నారు. అవరసమైన చోట ముందస్తుగా బైండోవర్ కేసులు నమోదు చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు.
 
 ఆశావహుల ఎదురుచూపు...
 ఎట్టకేలకు సుధీర్ఘ కాలం తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తీర్పునివ్వడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రామస్థాయి, మండల స్థాయి నాయకుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈసారి ఎలాగైనా సీటు సంపాదించి గెలుపొందాలని ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ దిశగా ఆయా పార్టీల నాయకులను కలుసుకుని తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement