కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జడ్పీటీసీల ఫోరం మండిపాటు
21న జడ్పీ కార్యాలయాల వద్ద నిరసన
హైదరాబాద్: స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణ జడ్పీటీసీల ఫోరం ఆరోపించింది. హక్కులను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ నిమిత్తం శుక్రవారమిక్కడ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం జడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లకు అభివృద్ధి నిధులు కేటాయించాలని, జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే విధంగా తగిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకు మాదిరిగానే జడ్పీటీసీలకు ఏటా రూ.25లక్షల సీడీపీ నిధులు, నెలకు రూ.25వేల వాహన అలవెన్స్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేక చాంబర్, ప్రతి జిల్లా పరిషత్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద ఏటా రూ.10కోట్లు ప్రభుత్వం కేటాయించాలని సమావేశంలో తీర్మానించారన్నారు. జడ్పీటీసీలకు పెంచిన గౌరవ వేతనం ఐదు నెలలుగా అందడంలేదని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పరిషత్ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా, చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఫోరం గౌరవాధ్యక్షుడు ఏనుగు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు తానాజీరావు, అంజయ్య, నారాయణరెడ్డి, అధికార ప్రతినిధి రామకృష్ణారెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు
Published Sat, Sep 5 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM
Advertisement