సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ 28న జారీచేసిన జీఓ 176ను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బిర్రు ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిపై గురువారం సీజే నేతత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
జనాభా లెక్కించాకే రిజర్వేషన్లు..
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పి.వీరారెడ్డితో పాటు మరికొందరు వాదనలు వినిపిస్తూ.. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని, కాని బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారి జనాభాను లెక్కించాలన్నారు. ఇవేమీ చేయకుండానే బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారన్నారు. పంచాయతీరాజ్ శాఖ సర్వే ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయడం చట్ట విరుద్ధమన్నారు.
జనాభా పెరిగినా.. 34 శాతమే రిజర్వేషన్లు
అనంతరం.. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని సుప్రీంకోర్టు ఏ సందర్భంలో చెప్పిందో ఆయన ధర్మాసనానికి వివరించారు. తాము బీసీ లెక్కలను తేల్చి వాటి ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు. బీసీ ఓటర్లు 48.13 శాతమని.. అయినప్పటికీ తాము వారికిచ్చింది 34 శాతం రిజర్వేషనేనని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా పంచాయతీ ఎన్నికలు పెట్టి తీరాలని, లేని పక్షంలో కేంద్ర నిధులు ఆగిపోతాయని ఆయన కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment