ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తాజాగా ఇచ్చిన తీర్పు ఆసక్తిని గొల్పుతోంది. గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని హైకోర్టు కొట్టిపడేసిన సందర్భంగా.. గ్రామాలను పరిరక్షించుకోవాలని న్యాయమూర్తి హితవు చెప్పారు. అన్ని గ్రామాలను పట్టణీకరణ చేస్తే మన సంస్కృతి, వ్యవసాయం ఏమి అవుతాయని కూడా ఆయన ప్రశ్నించారు. భారత దేశ ఆత్మ గ్రామాలలోనే ఉందన్న మహాత్మాగాంధీ అన్న వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేశారు. మరి 33 వేలకుపైగా ఎకరాల మాగాణి భూమిని రైతులనుంచి తీసుకుని గత ప్రభుత్వం సంకల్పించిన అమరావతి రాజధాని భూముల విషయంలో ఈ తీర్పు వర్తించదా? అమలాపురానికి ఒక నీతి, అమరావతికి మరొక రీతి సరైందేనా?
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అత్యంత ఆసక్తికరంగా ఉంది. అమలాపురం, చుట్టుపక్కల ఉన్న 200 పైగా గ్రామాలను కలుపుతూ గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవోని హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అందులో గ్రామాలను పరిరక్షించుకోవాలని న్యాయమూర్తి హితవు చెప్పారు. అన్ని గ్రామాలను పట్టణీకరణ చేస్తే మన సంస్కృతి, వ్యవసాయం ఏమి అవుతాయని ఆయన ప్రశ్నించారు. భారత దేశ ఆత్మ గ్రామాలలోనే ఉందన్న మహాత్మాగాంధీ అన్న వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తు చేశారు. నిజంగానే న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆలోచించదగినవి. గత కొన్నేళ్లుగా పట్టణాలు పెరిగే కొద్దీ వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. కాస్త డబ్బు ఎక్కువ వస్తోందని రైతులు కూడా తమ భూములను వ్యాపారులకు విక్రయించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీని ప్రభావం వ్యవసాయంపై కూడా పడుతోంది. గ్రామాలలో వ్యవసాయం తగ్గుతోంది. ఇతర వృత్తులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంతో ప్రాధాన్యం కలిగినటువంటిది.
ఇదే సమయంలో గత ప్రభుత్వం రాజధాని పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలను కలుపుతూ రాజధాని అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చింది. అందులో 29 గ్రామాలను కోర్ కాపిటల్‌గా ప్రకటించింది. ఈ కోర్ కాపిటల్ పరిధిలోని పలు గ్రామాలలో మూడు పంటలు పండే భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రాజధాని పేరుతో భారీ భవనాలు నిర్మించవద్దని అప్పట్లో పర్యావరణ వేత్తలు సూచించారు. కృష్ణానది కరకట్టను ఆనుకుని భవంతులు నిర్మించిన తీరును కూడా వారు తప్పు పట్టారు. పర్యావరణ ప్రభావం గురించి కూడా వారు పలు వ్యాఖ్యలు చేశారు. ఒక సందర్భంగా ప్రముఖ పర్యావరణ వేత్త రాజేంద్ర సింగ్ ఆ ప్రాంతంలో పర్యటించడానికి వస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆయనను అక్కడకు రానివ్వలేదు. అప్పట్లో రాజధాని పరిధిలోని గ్రామాలలో భూములు ఇవ్వడానికి ఒప్పుకోని కొంతమంది రైతుల పంటపొలాలను కూడా దగ్ధం చేయడంలో ఆనాటి ప్రభుత్వ పాత్ర ఉందని చాలామంది భావి స్తారు. ఉండవల్లి, పెనుమాక తదితర కొన్ని గ్రామాల రైతులు అయితే ఒక వైపు ఉద్యమం, మరో వైపు కోర్టులలో పోరాటం చేశారు. అదే సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆయా ప్రాంతాలలో పర్యటించి రాజధానికి గుంటూరు– విజయవాడ మధ్య ప్రాంతం అనువైనది కాదని అభిప్రాయపడింది. దీనివల్ల పంటలు పండే భూములు అన్నీ పట్టణీకరణ కిందకు పోతాయని పేర్కొంది. కానీ ఈ నివేదికను బుట్టదాఖలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం మొదట విజయవాడ పరిసరాలలో రాజధాని అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఊహాగానాలకు అవకాశం ఇచ్చింది. అమాయకులైన అనేకమంది మెట్ట ప్రదేశంగా ఉన్న నూజివీడు ప్రాంతంలో రాజ ధాని వస్తుందని నమ్మి అక్కడ భూములు కొని నష్టపోయారు. మరోవైపు తెలుగుదేశం పెద్దలు కొందరు ప్రస్తుత అమరావతిగా పరిగణించే మారుమూల గ్రామాలలో భూములు కొనుగోలు చేయగలిగారు. దానినే ఇన్‌సైడ్ ట్రేడింగ్ అని అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శలు చేసేది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
విశేషం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి రాజధానిపై నివేదిక ఇవ్వాలని కోరితే, చంద్రబాబు ప్రభుత్వం అప్పటి మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, వ్యాపారులతో కమిటీ వేసింది. ఆ కమిటీ చేసిందేమీ పెద్దగా లేదు. చంద్రబాబు మాత్రం సుమారు 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సమీకరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఎవరైనా దీన్ని వ్యతిరేకిస్తే వారిని వేధించారు. ఆయా రాజకీయ పార్టీలు ఇన్ని వేల ఎకరాల సేకరణ సరికాదని వాదించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వేలాది ఎకరాలను అప్పటి నుంచి బీడు భూములుగా మార్చి రైతులకు మాత్రం ఏటా ప్రభుత్వం కౌలు చెల్లిస్తూ వస్తోంది. ఓటుకు నోటు కేసు తర్వాత ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలిపెట్టి చంద్రబాబు కృష్ణానది ఒడ్డున ఒక అక్రమ కట్టడంలో నివసించడం ఆరంభించారు. ఒక ముఖ్యమంత్రే ఇలా అక్రమ కట్టడంలో ఉంటారా అని ఎందరు విమర్శలు చేసినా పట్టించుకోలేదు. జాతీయ రహదారికి ఇరవై , ముప్ఫై కిలోమీటర్ల దూరంలో మారుమూల అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటివాటికి తాత్కాలిక భవనాలు నిర్మించారు. ఆ తర్వాత శాశ్వత భవనాలు నిర్మించడానికి లక్ష కోట్ల ప్రణాళికను ప్రకటించారు. కేంద్రానికి ఈ నిధుల కోసం లేఖలు రాస్తే వారు ఆశ్చర్యపోయారు. కేంద్రం 2,500 కోట్ల రూపాయలను ఇచ్చి సరిపెట్టింది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి రాజధానిలోనే ప్రభుత్వం నిధులు అన్నిటిని వెచ్చిస్తోందన్న భావన ప్రజలలో ఏర్పడి బాబు ప్రభుత్వ ఓటమికి దారి తీసింది.
ఈ నేప«థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చి అసెంబ్లీలో చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిపై ప్రతి పక్ష తెలుగుదేశం, మరికొన్ని పక్షాలు ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళనలు చేయడానికి పిలుపు ఇచ్చాయి. అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కొందరు రైతులు కానీ శిబిరం వేసుకుని ప్రతిరోజు నిరసన తెలుపుతుంటారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై పలువురు హైకోర్టుకు వెళ్లారు. వారిలో ఎక్కువమంది టీడీపీ మద్దతుదారులో, సానుభూతిపరులో ఉన్నారు. ఇప్పుడు ఈ కేసును హైకోర్టులో విచారిస్తున్నారు. రాజధాని విషయంలో హైకోర్టు జోక్యం తగదని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ, ఇందులో జరిగిన స్కామ్‌లు, అప్పట్లో ఆయా కమిటీల సిఫారసులు తదితర విషయాలను తన వాదనలో వినిపించారు. అయితే కేంద్రం చేసిన చట్టంలో మూడు రాజధానులకు అవకాశం లేదని, అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌లు వేసినవారు వాదించారు.
హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో తెలియదు. కాని అదే హైకోర్టులో మరో ధర్మాసనం కోనసీమలో అర్బన్ అథారిటీని వ్యతిరేకిస్తూ గ్రామాలలో వ్యవసాయాన్ని పాడు చేయవద్దని, మన సంస్కృతిని దెబ్బతీయవద్దని వ్యాఖ్యానించింది. మరి అలాంటప్పుడు బాబు ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించడం కానీ, మూడు పంటలు పండే భూములను బలవంతంగా తీసుకోవడం కానీ, విజయవాడ, గుంటూరు మధ్య మరో మహానగరం నిర్మిస్తామని చెప్పడం కానీ .. ఇవన్నీ కూడా ఆ గౌరవ న్యాయమూర్తి వేరే కేసులో చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటే బాబు ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని అనుకోవాలి కదా అన్న వాదన తెరపైకి వస్తుంది. రాజధాని ప్రాంతం కాబట్టి న్యాయమూర్తి వ్యాఖ్యలు ఈ ప్రాంతానికి వర్తించవు అంటే ఏమీ చెప్పలేం. కానీ ఒకే హైకోర్టులో గ్రామాలను పట్టణాలుగా మార్చడంపై, వ్యవసాయం లేకుండా చేయడం, మన సంస్కృతిని దెబ్బతీయడం వంటివాటిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతాయా? అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఏది ఏమైనా గ్రామాల గురించి, సంస్కృతి గురించి చెప్పిన ఆ న్యాయమూర్తిని అభినందించాలి. అంతేకాక గ్రామాలే భారత దేశ ఆత్మ అని మహాత్మాగాంధీ అన్న విషయం గుర్తుచేసిన న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియచేయాలి. మరి అమరావతి గ్రామాలకు కూడా అది వర్తిస్తుందా? లేదా అన్నది కాలమే తేల్చాలా?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కొమ్మినేని శ్రీనివాసరావు
Comments
Please login to add a commentAdd a comment