
స్థానిక ఉద్యమాల దిశగా సీపీఐ
పలు తీర్మానాలను ఆమోదించిన పార్టీ
హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మం డల, గ్రామస్థాయి వరకు స్థానిక ఉద్యమాలను నిర్మించాలని సీపీఐ నిర్ణయించింది. ప్రధానమైన సమస్యలపై జిల్లాస్థాయిలో దీర్ఘకాలిక ఆందోళనలను నిర్వహించాలని తీర్మానించింది. ఈ నెల 25,26 తేదీల్లో మల్లన్నసాగర్, నారాయణఖేడ్, కొడంగల్ ప్రాజెక్టులను సందర్శించి, వాటి అలైన్‌మెంట్, రీడిజైన్లను పరిశీలించాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో నిర్ణయించారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, రక్షణ, రైల్వే, చిల్లర వ్యాపారంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 17న సైకిల్ యాత్రలు, జీపు జాతాల ద్వారా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది.
సెప్టెంబర్‌లో సాయుధ పోరాట వారోత్సవాలు
సెప్టెంబర్‌లో 11నుంచి 17 వరకు తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. రాష్ర్టకార్యవర్గభేటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 2న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతునిస్తున్నట్లు తెలియజేశారు. ఈ మేరకు ఇతర వామపక్షాలతో చర్చించి, ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. నవంబర్ 18నుంచి వరంగల్‌లో రాష్ట్రపార్టీ నిర్మాణ మహాసభను నిర్వహించాలని కార్యవర్గభేటీ నిర్ణయించిందన్నారు. కాగా గ్యాంగ్‌స్టర్ నయీం ఆగడాలు, అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జీతో విచారణకు చాడ వెంకటరెడ్డి డి మాండ్‌చేశారు.