ఆలయంలో కొలువైన హనుమంతుడు
పరకాల రూరల్: ఆంజనేయస్వామి, సువర్చలాదేవి కల్యాణానికి వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట భక్తాంజనేయస్వామి ఆలయం వేదిక కానుంది. లోక కల్యాణం కోసం బ్రహ్మచారులకు వివాహ వేడుకలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆరు సంవత్సరాలుగా ఇక్కడ అంజన్న కల్యాణం నిర్వహి ంచండం ఆనవాయితీగా వస్తోంది. శనివారం నిర్వహించే ఈ కల్యాణ వేడుక కోసం అవసరమైన ఏర్పాట్లును నిర్వాహకులు చేపట్టారు.
కల్యాణానికి ప్రత్యేక ఏర్పాట్లు..
భక్తాంజనేయస్వామి ఆలయంలో సువర్చలాదేవి–హనుమంతుడి కల్యాణం నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఆవరణలో భక్తుల కోసం చలువ పందిళ్లు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. మహా అన్నదానం చేసేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.
పెరిగిన భక్తుల తాకిడి..
పరకాల ప్రాతంలో తొలిసారి హనుమాన్ దీక్షలు ఈ ఆలయంలో చేపట్టడంతో భక్తులు పెరిగారు. పట్టణానికి చెందిన కాటూరి జగన్నాథచార్యులు 1988లో చెట్టుకింద ఉన్న హనుమాన్ విగ్రహానికి పూజలు అభిషేకాలు చేయడం ప్రారంభించారు. 1991లో జగనాన్నథచార్యులుతోపాటు మరో నలుగురు విజయవాడకు వెళ్లి 41రోజుల హనుమాన్ దీక్ష చేపట్టారు. మరుసటి సంవత్సరం నుంచి ఈ ఆలయంలో హనుమాన్ దీక్షాపరుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అలాగే 1997లో 108 కలశాలతో దుర్గాప్రసాద్ స్వామీజీ చేత యజ్ఞాలు చేయించారు. 2000 సంవత్సరంలో 1108 కలశాలతో హోమాలు చేయించారు. 2013లో 108 వినాయక విగ్రహాలతో 41రోజుల పాటు ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఆలయంతో సుమారు పది వేలకు పై బడి భక్తులు హనుమాన్ మాలాధారణ చేస్తున్నారు.
ఆలయానికి వందేళ్ల చరిత్ర..
ఈ ఆలయానికి నూరు సంవత్సరాల చరిత్ర ఉంది. నాడు ఒక చెట్టు కింద విగ్రహ రూపంలో వెలిసిన హనుమంతుడికి ఆలయం కట్టించారు. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి(ఇల్లంతకుంట పౌర్ణమి) రోజున ఆలయం చుట్టుపక్కల ఉన్న మల్లక్కపేట, రాయపర్తి, నాగారం, నర్సక్కపల్లి గ్రామాల నుంచి భక్తులు ఎడ్లబండ్లపై వచ్చి మొక్కులు చెల్లించుకునే వారు. కాల క్రమేనా ఆలయ విశిష్టత పెరిగి ప్రసిద్ధి గాంచిన హనుమాన్ దేవాలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది.
బ్రహ్మచారి అయిన హనుమంతుడి కల్యాణం చాలా శ్రేష్టమైనది. మన రాష్ట్రంలో ఇక్కడ మాత్రమే హనుమంతుడి కల్యాణం నిర్వహిస్తున్నాం. హోమంతో ప్రారంభమై పూర్ణాహుతి అనంతరం సువర్చలాదేవితో ఆంజనేయస్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుంది.
– కాటూరి జగన్నాథచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు
Comments
Please login to add a commentAdd a comment