ఆర్ధనగ్న ప్రదర్శనలు, వినూత్న నిరసన తెలుపుతున్న లారీ ఓనర్లు
ఖిలా వరంగల్: భవిష్యత్ కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన నిబంధనలు, ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ లారీ ఓనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా శనివారం రవాణా సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో రోజు సమ్మెలో సుమారు 2వేల లారీలను ఎక్కడికక్కడే సరుకులతో నిలిపి వేశారు. వివిధ జిల్లాలకు చెందిన వందలాది లారీలు రోడ్డుపైన బారులు తీరాయి. ఈ మేరకు జిల్లాకు వచ్చిన సరుకులు, నిత్యావసరాల లోడులను మాత్రం కలెక్టర్ ఆదేశం మేరకు యాజమాన్యాలు రవాణా, దిగుమతికి అనుమతించాయి. ఈ సందర్భంగా నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా జిల్లా ఆధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
లారీ ఓనర్లు రోడ్లపై వినూత్న నిరసనలు
రోడ్లపై లారీలను యాజమానులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ అందోళన, ఆర్ధనగ్న ప్రదర్శనలు, వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకపక్క వర్షం కురుస్తున్న లారీ యజమానులు రోడ్లపై బైఠాయించి అందోళనలు చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ పోలీసులు స్పందించి అసోసియేషన్ నాయకులకు నచ్చ చెప్పి ట్రాఫిక్ క్లీయర్ చేశారు. దూర ప్రాంతాల డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డు పక్కనే వంటా వార్పు చేస్తూ కనిపించారు. సమ్మె ఎప్పటికీ ముగస్తుందో ఆర్థం కావడం లేదని, ఎక్కువ రోజుల పడితే తమ వద్ద ఖర్చులకు చేతిలో డబ్బులేవని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
సమ్మె మరింత ఉధృతం చేస్తాం..సమ్మిరెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చి లారీ యజమానుల సమస్య పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వరంగల్ డిస్ట్రిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సమ్మిరెడ్డి, అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ జె.మధుసుధన్‌రావు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ నగర ప్రధాన రోడ్లపై వరంగల్ జిల్లా లారీ అసోసియేషన్, ఓరుగల్లు లోకల్ లారీ, వరంగల్ లోకల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం అందోళనను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగం పట్ల ఆత్యంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని లారీ యజమానులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తమ ప్రధానమైన 11డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేకుంటే ఆదివారం నుంచి నిత్యవసర సరుకులను సరఫరా చేసే వాహనాలను కూడా ఆడ్డుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఖాజాపాషా,వరంగల్ లోకల్ లారీ అధ్యక్షుడు వేముల భూపాల్, ఓరుగల్లు లారీ ఆసోసియేషన్ అధ్యక్షుడు ఎండి గోరేమియా,సప్లై అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండి బాబర్, కొండా సత్యనారాయణ, ఎండీ యూసూఫ్, ఎండి ఫీరోజ్, సద్దాం హుస్సేన్,రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, నారాయణ, వేముల క్రాంతి, సాధిక్, వాడికే విద్యాసాగర్, రాజు,సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment