షట్‌ డౌన్‌ | M Seva Centers ‎Organizers Problems Warangal | Sakshi
Sakshi News home page

షట్‌ డౌన్‌

Published Wed, Oct 31 2018 1:20 PM | Last Updated on Fri, Nov 9 2018 12:56 PM

M Seva Centers ‎Organizers Problems  Warangal - Sakshi

సాక్షి, జనగామ: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మీ సేవ కేంద్రాల్లో వసూలు చేసే కమీషన్‌ రుసుం పెంచాలని మీ సేవ నిర్వాహకులు(ఆపరేటర్లు) ఆందోళన బాటపట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని పోరాటానికి సిద్ధమయ్యారు. ఆందోళనలో భాగంగా నవంబర్‌ 1వ తేదీ నుంచి సామూహికంగా మీ సేవా కేంద్రాలను బంద్‌ చేయాలని నిర్ణయిం చారు. ప్రభుత్వం కమీషన్‌ ధరలను సవరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

500 రకాల సేవలు..
ధ్రువీకరణ పత్రాల జారీలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు 2011లో మీ సేవ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం 662 కేంద్రాలు ఉన్నాయి. 50 రకాల ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధించిన  500 రకాల సేవలను మీ సేవ ద్వారా అందిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆర్జీదారులకు మీసేవ ద్వారా  నిర్దిష్ట గడువులోగా ధ్రువీకరణ పత్రాలను అందిస్తున్నారు. కులం, ఆదాయం, నివా సం, పహాణీలు, జనన, మరణ పత్రాలతోపాటు పలు రకా ల ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా జారీ చేస్తున్నారు.

కమీషన్‌ కోసం ఆందోళన బాట..
మీ సేవ కేంద్రాల్లో జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాల జారీలో ప్రభుత్వం చెల్లిస్తున్న కమీషన్‌ తక్కువగా ఉందని నిర్వాహకులు ఆందోళన బాటపడుతున్నారు. 2011లో ఖరారు చేసిన కమీషన్‌నే ఇప్పటికీ చెల్లిస్తున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్‌ రాకపోవడంతో నిర్వాహకులు ఇక్కట్లు పడుతున్నారు. పేపర్‌ ధరలు పెరగడంతో జీఎస్టీతో మరింత ఆర్థికభారం పడుతోంది. కమీషన్‌ను ప్రభుత్వం సవరించకపోవడంతో ఆందోళన మార్గం తప్ప మరోదారి లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మీసేవ నిర్వాహకుల డిమాండ్లు ఇవే..

  •      ప్రైవేటు ఎస్‌సీఏలను తొలగించి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి మీసేవ కేంద్రాలను తీసుకోవాలి.
  •      మీ సేవ నిర్వాహకుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ప్రమాద బీమా, ఆరోగ్య బీమా సౌకర్యాలను కల్పించాలి. 
  •      యూజర్‌ చార్జీలను పెంచాలి.
  •      సేవలపై కమీషన్‌ 80 శాతం వచ్చేలా చూడాలి. 
  •      మీ సేవ నిర్వాహకులకు వచ్చే కమీషన్‌పై జీఎస్టీ పడకుండా నిర్ణయం తీసుకోవాలి. 
  •      ఫిజికల్‌ కాపీలను అడుగుతున్న అధికారులకు ప్రభుత్వపరంగా సూచనలు చేయాలి. 
  •      ప్రతి సంవత్సరం మీ సేనను రెన్యూవల్‌ చేసుకునే విధానాన్ని తొలగించాలి. 
  •      అప్లికేషన్లు తప్ప మిగితా కాపీలకు స్కానింగ్‌ చార్జీలను  విధించాలి. 
  •      నోటిఫికేషన్లు లేకుండా మీ సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నోటిఫికేషన్లు లేకుండా అనుమతి ఇచ్చే అధికారులపై చర్య తీసుకోవాలి.
  •      మీ సేవ ఉన్న గ్రామాల్లో సమగ్ర సమాచార కేంద్రాలను మూసివేయాలి. 
  •      మీ సేవ కేంద్రాలకు ఆధార్‌ సెంటర్లివ్వాలి. 
  •      ప్రతి మీసేవ నిర్వాహకుడికి సీఎస్‌సీ లాగిన్‌ ఇవ్వాలి. 
  •      స్టాంప్‌ వెండర్స్‌ విక్రయాలతోపాటు యూనివర్సిటీ ఫీజుల చెల్లింపునకు అవకాశమివ్వాలి. 

ప్రభుత్వం స్పందించకపోతే బంద్‌ పాటిస్తాం  
మీ సేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు సందర్భాల్లో నివేదించాం. ఇటీవల ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందించాం. నవంబర్‌ 1 నుంచి మీ సేవ కేంద్రాలను బంద్‌ చేసి మా కనీస హక్కులను సాధించుకుంటాం. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కమీషన్‌ రాక  కుటుంబాలను పోషించడం కష్టంగా మారింది. రూం రెట్లు, జీఎస్టీ భారంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. మా న్యాయపరమైన సమస్యలను తీర్చాలి. లేకపోతే కేంద్రాలను బంద్‌ చేసి ఆందోళన కార్యక్రమాలను చేపడుతాం. – రావిపాటి దేవేందర్, తెలంగాణ మీ సేవ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement