
9 డిగ్రీల కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు l వణుకుతున్న జనం ∙పడిపోయిన పగటìజగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్ చలి తీవ్రత రోజు..రోజుకు పెరిగిపోతోంది. రాత్రి వేళనే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. రాత్రి వేళనైతే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. వారం రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఉదయం పది దాటందే జనం బయటకు రావడం లేదు. సాయంత్రం ఐదు గంటలు అయ్యిందంటే ఇళ్లకు చేరుకుంటున్నారు.
6 నుంచి 8 కి.మీ వేగంతో చలిగాలులు గంటకు 6 నుంచి 8 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలులు జనవరి 2 వరకు ఉండే అవకాశం ఉంది. గరిష్ట(పగటి) ఉష్ణోగ్రతలు 27–29 డిగ్రీల సెల్సియస్ వద్ద, కనిష్ట(రాత్రి) ఉష్ణోగ్రతలు 11–12 డిగ్రీల సెల్సియస్ వద్ద కదలాడుతున్నాయి. గాలిలో తేమశాతం పెరిగింది, ఉదయం 50–62 శాతం, మధ్యాహ్నం 25–35 శాతంగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా జిల్లా ప్రజానీకాన్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చలి ప్రభావంతో స్వెట్టర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో స్వెట్లర్ మొన్నటి వరకు రూ.300 నుంచి రూ.350 ఉండగా, ప్రస్తుతం రూ.400కు విక్రయిస్తున్నారు.
చలితో వరినారుకు కష్టం
రెండు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో వరినారుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త ఉమారెడ్డి తెలిపారు. ఇందుకోసం వరి నారు మడిలో రాత్రి వేళలో నీరు తీసి ఉదయాన్నే నీరు పెట్టాలని కోరారు. వరినారుపై రాత్రి వేళల్లో కవర్లు కప్పి, ఉదయం తీసివేస్తే చలి ప్రభావానికి గురికాకుండా ఉంటుందన్నారు.
చలిపై అప్రమత్తం
చలితీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ శరత్ ఆదేశాలతో వైద్యశాఖ కదిలింది. చలి వల్ల కలిగే నష్టాల గురిం చి అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులు ప్రణాళికలు తయారు చేశారు. డీఎంహెచ్‌వో శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య రక్షణలో భాగం గా చర్యలు చేపట్టారు. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, నివారణ చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
వచ్చే వ్యాధులు
జలుబు, ఆయాసం, ఆస్తమ, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం, పిల్లికూతలు, జ్వరం, దగ్గు, ఒల్లునొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవినొప్పి, చెవి నుంచి చీము కారడం, చర్మం పొడిబారడం, డొక్కలు ఎగురవేయడం వంటి సమస్యలు వస్తాయి.
చలి నుంచి ఇలా కాపాడుకోవాలి
- మంచు పడుతున్న సమయంలో బయటకు పోరాదు. స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించాలి.
- చెవులలోకి గాలి వెళ్లకుండా వస్త్రధారణ చేసుకోవాలి.
- వేడి ఆహారపదార్థాలు తీసుకోవాలి.
- గోరువెచ్చని నీరు తాగాలి.
- చర్మం పొడిబారకుండా ఏదైన లేపనం, కొబ్బరినూనె, వ్యాజిలెన్ రాసుకోవాలి.
- చిన్నపిల్లలకు శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా ఉన్ని దుస్తులు వేయాలి.
- గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment