
‘మహానాడు’ ఏర్పాట్ల పరిశీలన
* గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరంలో పనులు ప్రారంభం
* దాదాపు 50వేల మందికి సౌకర్యాలు: ఎల్. రమణ
మొయినాబాద్ రూరల్: గండిపేటలోని ఎన్టీఆర్ కుటీరంలో ఉభయ రాష్ట్రాల మహానాడును భారీఎత్తున నిర్వహించనున్నామని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మొయినాబాద్ మండలంలోని హిమాయత్‌నగర్ సమీపంలోగల గండిపేట ఎన్టీఆర్ కుటీరంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు సభాస్థలాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ.. మహానాడుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు తరలిరానున్నట్లు తెలిపారు. ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరం, భోజన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహానాడును గత ఏడాది కంటే ఈసారి భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. దాదాపు 50వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్, వెంకటవీరయ్య, సుధాకర్ యాదవ్, బుక్క గోపాల్, కంజర్ల శేఖర్, మాణిక్యం, రాజు పాల్గొన్నారు.