గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వ్యూహాలు | Main Political Parties focus on winning Parliament Elections | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వ్యూహాలు

Published Sun, Mar 17 2019 3:04 PM | Last Updated on Sun, Mar 17 2019 3:16 PM

Main Political Parties focus on winning Parliament Elections - Sakshi

సాక్షి, వనపర్తి:  జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకు మరో 48 గంటలు సమయం ఉండగానే జిల్లాలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నాయకులు, తమ కేడర్‌తో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని వేర్వేరు గ్రామాల్లో అధికార టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల ప్రధాన నాయకులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి పార్టీ నాయకులతో సమావేశమయ్యారు.

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేశారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండలంలోని విరాయపల్లిలో నిర్వహించగా.. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం పెద్దమందడి మండల కేంద్రంలో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఇప్పటివరకు నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ లోస్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోలేదు. ఈ స్థానం ఏర్పడిన 1962 నుంచి ఇప్పటివరకు ఎవ్వరూ సాధించలేనంత మెజార్టీతో ఈ సారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని, కేసీఆర్‌కు, కేటీఆర్‌కు బహుమతి ఇవ్వాలనే ఆలోచనతో మంత్రి నిరంజన్‌రెడ్డి ఉన్నారు.

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం ఎన్నికల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు సమావేశంలో దిశానిర్దేశం చేశారు. ఇటీవల భారీ మెజార్టీతో శాసన సభ్యుడిగా సాధించిన విజయం కంటే.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానాన్ని గెలిపించి సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకోవాలనే కసితో మంత్రి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీలో నాయకుల మధ్య మనస్పర్థలపై దృష్టి సారించారని, సర్ధిచెప్పినట్లు తెలుస్తోంది. మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి భారీ మెజార్టీ వచ్చేలా చూడాలని సూచించారు.

దీంతో అధికార పార్టీలో నాయకులు, కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. వనపర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీల నుంచి కొంతకాలంగా దశలవారీగా.. ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరటంతో అధికార పార్టీకి పెద్దమందడి మండలంతో పాటు నియోజకవర్గంలో మరింత బలం పెరిగినట్లు తెలుస్తోంది.

ఎలాగైనా నిలబెట్టుకుందాం..  
ఇదిలా ఉండగా నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క స్థానం కొల్లాపూర్‌లోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉన్నారు. ఉన్న కాసింత పట్టుతోనే విజయం కేతనం ఎగుర వేసేందుకు కుస్తీ పట్టాలని వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ఎన్నికల యుద్ధానికి నాయకులను సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు కార్యకర్తల సమావేశంలో సూచనలు చేశారని తెలుస్తోంది.   

 నేడు జిల్లా కేంద్రంలో మంత్రి సమావేశం  
పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాయకులను, కార్యకర్తలను అప్రమత్తం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం తన నివాసంలో వనపర్తి, గోపాల్‌పేట, రేవల్లి మండలాలతో పాటు వనపర్తి పట్టణ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement