
ఉద్యోగులను చెప్పులతో కొట్టాలా?
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులను చెప్పులతో కొట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడం అభ్యంతరకరమని, తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను అవమానించడం సరికాదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను తరిమేయాలన్న కేటీఆర్ తీరు టీఆర్‌ఎస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. భద్రాద్రి రాముని కళ్యాణంలో ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ మనవడు పట్టు వస్త్రాలు సమర్పించడం రాచరికపు పోకడలకు పరాకాష్ట అని విమర్శించారు. ఏ అర్హతతో కేసీఆర్ మనవడు పట్టువస్త్రాలు సమర్పించారని ప్రశ్నించారు. మాట తప్పడంలో దేశంలోనే మొదటి స్థానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తారన్నాని రవి విమర్శించారు. టీఆర్‌ఎస్ నేతలు చెప్పేదొకటి, చేసేదొకటని.. కాంగ్రెస్‌ను తిట్టేందుకే కేటీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నట్లుగా ఉందని దుయ్యబట్టారు.
కవిత ఎందుకు బంగారం?: మహేశ్‌కుమార్
ఏం చేశారని నిజామాబాద్ ఎంపీ కవిత బంగారమయ్యారో మంత్రి కేటీఆర్ చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తేనే కేటీఆర్ మంత్రి అయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేసిందేమిటో ఆ వేదిక మీదున్న డి.శ్రీనివాస్‌ను అడిగితే తెలిసేది కదా అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ నోరు అదుపులో ఉంచుకోకపోతే సీఎం కేసీఆర్ గత చరిత్ర విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.