మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం సిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం రథోత్సవం జరిగింది. ఉత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల మంది భక్తులు సిరసనగండ్ల గుట్టపైకి చేరుకున్నారు. అయితే స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు గుండం నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్ ఈసీఐఎల్‌కు చెందిన గిరి(24) అనే వ్యక్తి భార్య మంజులతో కలసి గుట్టపై ఉన్న గుండంలో స్నానం చేసేందుకు దిగి, ప్రమాదవశాత్తూ అందులో మునిగిపోయాడు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఈ విషయాన్ని ఎవరూ గమనించలేకపోయారు. ఎంతసేపటికీ భర్త కనిపించకపోయేసరికి భార్య మంజుల వెతకడం ప్రారంభించింది. మధ్యాహ్నం సమయానికి గిరి మృతదేహం గుండం నీటిపైకి తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు గిరికి వివాహం జరిగి నాలుగు నెలలే అయినట్లు తెలిసింది.