నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో బంధువులే దాడి చేసి, తీవ్రంగా కొట్టారు.
నవీపేట(నిజమాబాద్): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నం గ్రామంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో బంధువులే దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం...గ్రామానికి రఘుపతి భూమయ్య గ్రామ శివారులోని క్రషర్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అయితే సొంత చిన్నాన్న గంగారాంకు రఘుపతి మంత్రాలు చేస్తున్నాడని అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో భూమయ్య తనతోపాటు క్రషర్‌లో పని చేసే ఉద్యోగికి భోజనం తీసుకెళ్తుండగా గంగారాం అడ్డుకున్నాడు.
తమ ఇంటి వెనుక పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేశావని, మంత్రాలు చేయడం వల్లే తమ ఇంట్లో పదేళ్ల పాప అనారోగ్యానికి గురైందని ఆరోపిస్తూ గొడవకు దిగాడు. అతనికి కుటుంబసభ్యులు తోడయ్యారు. అంతా కలసి రఘుపతిని ఇంట్లోకి ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేయడంతో భూమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.