కట్టుకున్న భార్యే తనపై కేసు పెట్టిందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి హైదరాబాద్ మియాపూర్ కోర్టు ప్రాంగణంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ : కట్టుకున్న భార్యే తనపై కేసు పెట్టిందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి మియాపూర్ కోర్టు ప్రాంగణంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ ఎస్‌ఐ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మదీనాగూడలోని ఉషోదయ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి అశోక్ కుమార్(52)కు భార్య లక్ష్మి, కూతురు అమూల్య ఉన్నారు. వారి మధ్య విభేదాలు రావటంతో భార్య, కూతురుతో కలసి జీడిమెట్ల ఎంఎన్ రెడ్డి కాలనీలో వేరుగా నివాసముంటోంది.
కాగా లక్ష్మి భర్తపై గత ఏడాది వేధింపుల కేసు పెట్టింది. నష్టపరిహారం కింద రూ.5లక్షలు, నెలకు రూ.10వేలు భరణం ఇవ్వాలని, అశోక్ ఇంటిలో వాటా కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అశోక్ కోర్టుకు తిరగలేక భార్యను, కూతురును తన వద్దకు వచ్చేలా చేయాలని తన న్యాయవాది గిరీష్‌ను కోరేవాడు. తరచూ కోర్టుకు రావడం అవమానంగా భావించి మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం మియాపూర్ 9వ మెట్రోపాలిటన్ కోర్టులో వాయిదా ఉండడంతో అశోక్ కుమార్ కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోనే తనవెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. వెంటనే న్యాయవాదులు గమనించి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.