
సాక్షి సిటీబ్యూరో: వేసవికాలం అనగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడి పండ్లు. ఈ ఏడాది పంట తొందరగా మార్కెట్‌కు రావడంతో మామిడి సీజన్ ముందుగానే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరగవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సేల్ మార్కెట్‌లోనే సోమవారం మామిడి పండ్లు కేజీ రూ. 40–50 పలుకుతున్నాయి. దిగుబడి తగ్గడంతో పాటు పంట తొందరగా రావడంతో బహిరంగ మార్కెట్‌లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువగానే ఉండవచ్చని వ్యాపారుల అంచనా. సోమవారం బహిరంగ మార్కెట్‌లో బెనిషాన్ కిలో ధర రూ. 70–80 వరకు ధరపలికింది.
ఈ యేడాది మార్చిలోనే..
గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్‌లో పుంజుకుంటే ఈ ఏడాది మార్చిలోనే జోరందుకుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది పూత సమయంలో వర్షాల కారణంగా పంటకు నష్టం కలగడంతోపాటు అనుకున్న స్థాయిలో మామిడి పంట రాలేదని రైతులు చెబుతున్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే తొందరగా మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని రైతులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ మూడవ వారం నాటికి దాదాపు 2వేల టన్నుల మామిడి గడ్డిఅన్నాం పండ్ల మార్కెట్‌కు వచ్చింది. అయితే ఈ ఏడాది ఇప్పటికే 100 టన్నులు దాటింది. మార్చి నెల ముగిసే సరికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి మార్కెట్‌కు రావచ్చని అంచనా. దీంతో మార్కెట్ అధికారులు మామిడి నిల్వకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment