సాక్షి, న్యూఢిల్లీ: ఈనెల 10న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో తీవ్రమైన అవకతవకలు ఉన్నాయని, దాదాపు 30 లక్షల ఓట్లు పునరావృతం అయ్యాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా మరో 18 లక్షల ఓట్లు తెలంగాణలో, ఏపీలో రెండు చోట్లా నమోదై ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు సహా ఎన్నికల అధికారులకు శుక్రవారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘30 లక్షలు డూప్లికేట్ ఉన్నాయి.
అంటే మొత్తం ఓటర్లతో పోలిస్తే 12 శాతం. ఇది చిన్న సంఖ్య కాదు. ఆంధ్ర, తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో రెండు చోట్లా కొనసాగుతున్నవి 18 లక్షల ఓట్లు ఉన్నాయి. 20 లక్షల ఓట్లను తొలగించారు. ఎన్నికల సంఘం అధికారులు కూడా మేం చెప్పిన వాటిని ఇంచుమించుగా ఒప్పుకొన్నారు. వారి దృష్టికి కూడా వచ్చినట్లు చెప్పారు. సీడాక్ సంస్థతో తనిఖీ చేయిస్తున్నామని ఈసీ చెప్పింది. జంధ్యాల రవిశంకర్ తన పరిశోధక బృందంతో విశ్లేషించి ఈ అవకతవకలను తేల్చారు’అని శశిధర్‌రెడ్డి వివరించారు.
2019 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకొని జారీచేసిన షెడ్యూలును రద్దు చేశారని, ఆ షెడ్యూలు ప్రకారం ముందుకెళ్తే ఈ అవకతవకలను తొలగించొచ్చని చెప్పారు. కానీ 2018 జనవరి 1వ తేదీని ప్రామాణికంగా స్వల్పకాలిక సవరణలు చేపడుతున్నారని, దీంతో పొరపాట్లను సరిదిద్దడం సాధ్యం కాదని వివరించారు. అవకతవకలన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగినవేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అవకతవకలున్నా ముందస్తుకా..?
‘30 లక్షల ఓట్ల డూప్లికేషన్ తొలగించాలంటే చాలా సమయం పడుతుంది. సక్రమంగా లేవని తెలిసి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఎంతమేరకు సమంజసం. అసెంబ్లీ రద్దయినప్పుడు ముందస్తుగా వెళ్లాల్సిందే. కానీ ఈ అవకతవకలను సరిచేయకుండా సీఎం చెప్పినట్లు నవంబర్, డిసెంబర్‌లలో ఎన్నికలు పూర్తయితే ఈ అవకతవకలను ఎలా సరిచేస్తారు.. దేశంలో ఇదో ఆశ్చర్యకరమైన విషయం. ఎన్నికల సంఘం న్యాయంగా ఎన్నికలు నిర్వహించాలి. ఇన్ని తప్పిదాలు ఆధారాలతో చూపించినప్పుడు వాటిని సరిచేయాలి.
ఇందుకు చాలా సమయం పడుతుంది. ఇంత స్వల్ప సమయం సరిపోదు’అని పేర్కొన్నారు. ఎన్నికలను వాయిదా వేయాలంటారా అని ప్రశ్నించగా, ‘అవకతవకలను సరిచేయడానికి సమయం కావాలని అడుగుతున్నాం’అని బదులిచ్చారు. పూర్తి ఆధారసహితంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వివరించినట్లు జంధ్యాల రవిశంకర్ చెప్పారు. ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయని, శనివారం జాతీయ మీడియా ముందు నిరూపిస్తామని పేర్కొన్నారు.
‘30 లక్షల్లో 40 వేల మంది 18 ఏళ్లకంటే తక్కువగా ఉన్నారు. ఇది మొదటి తప్పు. భర్తపేరుతో ఒకసారి, తండ్రిపేరుతో మరోసారి ఉన్నవారు, సున్నా వయసు నుంచి 250 ఏళ్ల వయసు ఉన్న వారూ ఉన్నారు. పురుషుడు అని ఒకపేరుతో ఉన్నవి, అదే పేరుతో స్త్రీగా నమోదు చేశారు. పునరావృతమైన పేర్లు 15 లక్షలు ఉన్నాయి’అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment