సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2019–20 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్)పై ఉన్నత విద్యామండలి కసరత్తు వేగవంతం చేసింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలను ప్రారంభించాలంటే మొదటివారంలోనే సెట్లు నిర్వహించే యూనివర్సిటీలు, కన్వీనర్లు, షెడ్యూలును ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. అందులో భాగంగా కన్వీనర్లను ఖరారు చేసేందుకు జనవరి 2న ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అందులో అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, ఇతర అధికారులు పాల్గొననున్నారు.
2018–19 విద్యాసంవత్సరంలో సెట్లు నిర్వహించిన కన్వీనర్లలో నలుగురు ఈసారి మారనున్నాయి. గత ఏడాది ఐసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ(కాకతీయ వర్సిటీ), పీజీఈసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ షమీమ్ ఫాతిమా(ఉస్మానియా వర్సిటీ), పదవీ విరమణ పొందారు. గత ఏడాది లాసెట్ నిర్వహించిన ప్రొఫెసర్ ద్వారకనాథ్, ఎడ్‌సెట్ నిర్వహించిన ప్రొఫెసర్ మధుమతి త్వరలో పదవీవిరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో ఆ 4 సెట్లకు కన్వీనర్లుగా కొత్తవారిని నియమించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.
పాతవారికే మూడు సెట్ల బాధ్యత
ఎంసెట్, ఈసెట్, పీఈసెట్ నిర్వహణ బాధ్యతలను గతేడాది నిర్వహించిన వర్సిటీలకే అప్పగించి, పాతవారినే కన్వీనర్లుగా కొనసాగించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీంతో ఎంసెట్‌కు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఈసెట్‌కు అదే వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గోవర్ధన్, పీఈసెట్‌కు ప్రొఫెసర్ సత్యనారాయణ కన్వీనర్లుగా కొనసాగే అవకాశముంది. దానిపై జనవరి 2న జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించి అధికారికంగా నిర్ణయం ప్రకటించనుంది. సమావేశంలో కన్వీనర్ల పేర్లు, సెట్ల నిర్వహణ తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది.
మరోవైపు ఈసారి ఎంసెట్ నిర్వహిస్తామని ఉస్మానియా వర్సిటీ ముందుకు వచ్చినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఎలాంటి లేఖ అందలేదని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈసారి ఐసెట్ నిర్వహణ బాధ్యతలను తమకు అప్పగించాలని తెలంగాణ వర్సిటీ లేఖ రాసిందని, ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment