మావోయిస్టు భాస్కర్‌ దశాబ్దాల అజ్ఞాతం | Maoist Bhaskar Decade Underground In Adilabad District | Sakshi
Sakshi News home page

మావోయిస్టు భాస్కర్‌ దశాబ్దాల అజ్ఞాతం

Published Sun, Jul 19 2020 8:56 AM | Last Updated on Sun, Jul 19 2020 8:57 AM

Maoist Bhaskar Decade Underground In Adilabad District - Sakshi

బోథ్‌ నియోజకవర్గంలో గోడపై అతికించిన వాల్‌ పోస్టర్‌

సాక్షి,ఆదిలాబాద్‌: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ ఉమ్మడి జిల్లా అడవుల్లో సంచారం తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. భాస్కర్‌ దళాన్ని పట్టుకోవడమా లేదా తెలంగాణ నుంచి తరమికొట్టడమా అనే లక్ష్యంగా పోలీసుల కూంబింగ్‌ సాగుతోంది. అయితే ఈ మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ది ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచ్చెర సొంత గ్రామం. దళ సభ్యుడిగా నక్సల్‌ బరిలోకి దిగి దండకారణ్యంలో పని చేసి ప్రస్తుతం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు వహిస్తున్నాడు. దీంతో పోలీసులు ఆపరేషన్‌ భాస్కర్‌ లక్ష్యంగా ముందుకు కదులుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భాస్కర్‌ నేపథ్యం..
బోథ్‌ మండలం పొచ్చెర గ్రామంలో జన్మించిన భాస్కర్‌ 10వ తరగతి వరకు బోథ్‌లోనే చదివారు. ఆ తర్వాత 1989–91 మధ్యలో నిర్మల్‌లో ఇంటర్‌ చేశారు. ఆ సమయంలో ర్యాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యూ) ప్రెసిడెంట్‌గా పని చేశారు. అభ్యుదయ భావాలు కలిగిన భాస్కర్‌ ఆ సమయంలోనే నక్సల్‌ బరి వైపు ఆకర్షితులయ్యారు. అంతకు ముందు విద్యార్థి దశలోనే 1989 కాలంలో భూపోరాటాలు విస్తృతంగా సాగుతున్న సమయంలో తానుకూడా అందులో పాల్గొన్నాడు. 1994–95 లో దళంలోకి ప్రవేశించాడు. బోథ్‌ దళ సభ్యుడిగా పని చేసి అక్కడి నుంచి ఇంద్రవెల్లి దళం డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. అక్కడి నుంచి కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు చత్తీస్‌ఘడ్‌ దండకారణ్యంలోకి వెళ్లాడు. 25 ఏళ్ల వయసులో భాస్కర్‌ దళంలో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలుస్తోంది. ప్రసుతం 50 ఏళ్లు ఉంటాయని వారు చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోయారు. భాస్కర్‌కు ముగ్గురు సోదరులు ఉండగా వారు ప్రస్తుతం పొచ్చెరలోనే వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. భాస్కర్‌ దళంలో పని చేస్తున్న సమయంలోనే సహచరురాలు కంతి లింగవ్వను వివాహం చేసుకున్నట్లు చెప్తారు. అయితే దళంలోకి వెళ్లిన తర్వాత సోదరులకు భాస్కర్‌తో సంబంధాలు దూరమయ్యాయి. రెండున్నర దశాబ్దాలుగా ఆయన అజ్ఞాతం కొనసాగుతోంది.

రిక్రూట్‌మెంట్‌ కోసం..
కేంద్రం ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ విస్తృతంగా నిర్వహించడంతో ఛత్తీస్‌ఘడ్‌ దండకారణ్యం నుంచి బయటకు వచ్చినట్లు ప్రచారం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మార్చిలోనే ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. బోథ్, సిరికొండ అటవీ ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసుల దృష్టిలో ఉంది. ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా అడవుల్లో పోలీసులకు దళం తారస పడటంతో ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని ఓ మండలం నుంచి కొంత మంది యువకులు మిస్సింగ్‌ ఉండడంతోనే పోలీసులు దీన్ని సవాలుగా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మావో రిక్రూట్‌మెంట్‌ అనుమానాలు పోలీసుల్లో బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పట్టుకోవడమో లేని పక్షంలో తరిమికొట్టడమో అనే రీతిలో అడవులను జల్లెడ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఒక్కడే కాదు..
మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ సంచారం నేపథ్యంలో మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకప్పటి నక్సల్‌ ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. మంగీ, ఇంద్రవెల్లి, బోథ్, చెన్నూర్, సిర్పూర్, పిప్పల్‌ధరి, ఖానాపూర్‌ దళాలు ఒకప్పుడు అడవుల్లో అలజడి సృష్టించినవి. ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికీ దళంలో సుమారుగా 20 మంది ఉన్నట్లు ప్రచారంలో ఉంది. అందులో కొంత మంది కీలక పదవుల్లో ఉండటం గమనార్హం. మే నెలలో బోథ్‌ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వాల్‌పోస్టర్లు వెలిశాయి. ప్రజాపోరాట ముసుగులో నరహంతక నక్సలైట్లు అనే శీర్షికతో ఉన్నటు వంటి ఆ పోస్టర్లలో మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. భాస్కర్‌ తలపై ప్రస్తుతం రూ.20 లక్షల రివార్డు ఉంది. అయితే పోస్టర్‌లో రూ.8లక్షలుగా ఉండటం గమనార్హం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement